కనకదుర్గ గుడి ఈఓపై బదిలీ వేటు

10 August, 2018 - 3:04 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో చీర మాయమైన సంఘటన నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) పద్మపై వేటు పడింది. కనక దుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీర మాయమైన ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పద్మ స్థానంలో ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను నియమించింది. అమ్మవారి చీర మాయం కేసులో పాలకమండలి సభ్యురాలు సూర్యలత ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆమెను ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించింది.

విధుల్లో చురుగ్గా ఉండకపోవడంతోనే పద్మను బదిలీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆలయ ఈఓతో పాటు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా కూడా పద్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారనీ, దీంతో ఆమె గందరగోళానికి గురవుతున్నారని తెలిపాయి.

దుర్గ గుడిలో క్షుద్ర పూజల వివాదం తలెత్తడంతో ఆలయ ఈఓగా ఉన్న ఐఏఎస్ అధికారిణిని తొలగించిన ప్రభుత్వం పద్మను ఈఓగా నియమించింది. తాజాగా అమ్మవారికి భక్తులు సమర్పించిన చీర మాయం వివాదంతో పద్మ స్థానంలో ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను ఈఓగా నియమించింది.