వైసీపీ నేతలకు మధు ‘సూచన’

14 February, 2020 - 4:37 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: శాసన మండలి రద్దు, రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాలతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొయ్యి తానే తవ్వుకోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మండిపడ్డారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ.. విజయవాడ ధర్నా చౌక్‌లో శుక్రవారం ఆ పార్టీ నేత బాబురావు చేపట్టిన 24 గంటల దీక్షలో మధు పాల్గొన్నారు.

అమరావతిని ఆగం చేయడం.. వైయస్ఆర్ సీపీ చేసిన పెద్ద తప్పు అని ఆయన అభివర్ణించారు. గత ఐదేళ్లుగా పెరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం..ఒక్కసారిగా కుప్పకూలిపోయిందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అద్దెకు దిగేవారు కూడా కరువయ్యారన్నారు. ఈ ప్రభుత్వ కాస్టిల్లీ నిర్ణయం అని ఆయన అభివర్ణించారు. దారిన పోయే శనిని ఇంటికి దాకా తీసుకు వచ్చి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుందన్నారు.

151 మంది ఎమ్మెల్యేలు వచ్చిన ..తమ ప్రభుత్వ తీర్పు ముందు అన్ని బలాదూరే అని ఆ పార్టీ నేతలు ఉపన్యాసాలు చెబుతున్నారన్నారు. జర్మనీ పార్లమెంట్ లో 612 స్థానాలు ఉన్నాయని.. వాటినన్నింటిని నియంత హిట్లరు గెలుచుకున్నారని… ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏమిటో గుర్తు చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీపీఎం మధు సూచించారు.