పుట్టిన రోజు కంటే ముందే ..

09 July, 2019 - 4:55 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం జులై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనుల్లో నిమగ్నమై ఉంది. అయితే విజయ్ దేవరకొండ పుట్టిన రోజు జులై 27. అంటే హీరో విజయ్ పుట్టిన రోజు కంటే ఒక్క రోజు ముందు ఈ చిత్రం విడుదల కానుంది.

తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ మార్చిలో విడుదలైంది. దీనికి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ విద్యార్థి సంఘం నాయకుడిగా కనిపించనున్నారు. అదేవిధంగా హీరోయిన్ రష్మిక క్రికెటర్‌గా కనిపించనుంది.

ఇప్పటికే విజయ్, రష్మిక జంటగా నటించిన గీతగోవిందం.. 2018లో విడుదలై.. మంచి హిట్ అందుకుంది. అదేవిధంగా ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంటుందనే టాక్ టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్  స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.