అక్రమ ఉల్లి నిల్వలపై విజిలెన్స్ దాడులు

08 November, 2019 - 5:45 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఉల్లిపాయల ధరల్ని నియంత్ర చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని రంగంలోకి దింపింది. భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో ఉల్లి పంట దిగుబడి తగ్గడం.. వరదల కారణంగా మార్కెట్లో ఉల్లిపాయలకు కొద్దిరోజులుగా భారీగా కొరత ఏర్పడింది. ఉల్లి కొరతను అధిగమించేందుకు కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతికి అనుమతించింది. అయితే.. వాటి ధరల్లో పెద్ద ఎత్తున చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల కారణంగా రాష్ట్రంలోని వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ప్రజల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు చర్యల్లో భాగంగా అక్రమంగా ఉల్లిని నిల్వ చేసిన వారిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలో దాడులు చేస్తోంది. రెండు రోజులుగా ఏపీలోని 10 జిల్లాల్లో పెద్ద ఎత్తున విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ ఉంచడం, కృత్రిమంగా కొరత సృష్టించి ధర పెంచి విక్రయించడం.. ఎటువంటి అనుమతులు లేకుండా హోల్‌సేల్, రిటైల్‌ షాపులు నిర్వహించడాన్ని అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70 మంది వ్యాపారులపై ‘విజిలెన్స్‌’ దాడులు చేయగా 47 మంది అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వారి నుంచి రూ.27,06,200 విలువైన 603.50 క్వింటాళ్ల ఉల్లిపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన 37 మందికి జరిమానాలు విధించారు. మిగిలిన 10 మందిపై కేసులు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే.. హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారుల వద్ద నిబంధనలకు మించి ఉల్లిపాయల నిల్వలు ఉంచకూడదని కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకూ టోకు వ్యాపారులు 50 మెట్రిక్‌ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్‌ టన్నులు మాత్రమే నిల్వలు ఉంచుకోవాలన్నారు. మరోవైపు.. కొందరు వ్యాపారులు అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ సెస్‌ ఎగవేశారని కూడా ఆయన తెలిపారు.

కాగా.. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు రాకపోవడంతో ఆ కొరతను కర్నూలు ఉల్లిపాయలు కొంతవరకూ తీర్చాయి. ప్రస్తుతం రైతుబజార్లలో కర్నూలు ఉల్లిపాయలు కిలో రూ.36కు విక్రయిస్తున్నారు.

కొన్ని రాష్ట్రాల్లో ఉల్లి పంట దిగుబడి తగ్గడం.. వరదల ప్రభావంతో వాటి రవాణాపై ప్రభావం పడింది. దీంతో వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌కు తెరలేపారు. అందుబాటులో ఉన్న ఉల్లిపాయలను మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తక్కువ ధరకు ముందుగానే సేకరించుకుని తమ గిడ్డంగుల్లో పెద్దఎత్తున నిల్వచేశారు. వాటిని ఉద్దేశపూర్వకంగానే రోజువారీగా కొంతమేర విక్రయాలు జరుపుతూ కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్‌లో ఒక్కసారిగా ఉల్లి కొరత ఏర్పడింది. వ్యాపారులు ఒక పథకం ప్రకారమే మార్కెట్‌ను ప్రభావితం చేస్తూ అక్రమార్జనకు పాల్పడున్నారని విజిలెన్స్‌ పరిశీలనలో వెల్లడైంది.