‘సమాజాన్ని నడిపించేది అక్షరమే’

01 January, 2018 - 5:09 PM

(న్యూవేవ్స్ ప్రతినిధి)

విజయవాడ: ‘సమాజాన్ని నడిపించేది అక్షరమే’ అని భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. 2018 సంవత్సరాన్ని ‘తెలుగుభాషా పరిరక్షణ సంవత్సరం’గా ప్రకటించడం సంతోషదాయకమని అన్నారు. నాశనం లేనిది, జ్ఞానాన్ని పంచేది అక్షరమేనని, పుస్తక మహోత్సవం ఎంతో పవిత్రమైందని, మన పురాణాలు, ఇతిహాసాలను పరిశీలిస్తే పుస్తకానికి, అక్షరానికి ఎంతో ప్రాధాన్యత ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. అన్నివైపుల నుంచీ జ్ఞానం వర్ధిల్లాలని రుగ్వేదంలో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో 29వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. జీవితం అనే పుస్తకంలో నిన్న అనే పేజీ పూర్తి అయిన పేజీ అని, భవిష్యత్ అనే పేజీ ఖాళీగా ఉంటుందని, వర్తమానం అన్న పేజీని రాస్తూనే ఉంటామన్నారు. అందుకే మనం వర్తమానంలో ఎంత బాగా రాయగలిగితే అంత బాగా రాయాలని సూచించారు. ఎందుకంటే వర్తమానం అనే పేజీలో రాస్తున్న అక్షరాల్ని చెరిపివేయలేం ఒక రచయిత అన్నారని వెంకయ్య నాయుడు ప్రస్తావించారు.
‘పుస్తకాలు మన స్నేహితులు. మంచి పుస్తకాలు మన జీవన ప్రమాణాలను పెంచుతాయి. మనం క్రుంగిపోయినప్పుడు అవి దారి చూపిస్తాయి. సమాజంలో బాగా చదువుకున్న వారికే విలువ ఎక్కువ ఉంటుంది. ఒక పుస్తకం తెరవడం అంటే ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచినట్లే అని భావించాలి’ అని వెంకయ్య నాయుడు అన్నారు.వేద సాహిత్యంలో స్త్రీలు కూడా సమానంగా పాలుపంచుకున్నారని, గార్గీ, మైత్రేయ తదితరులు అనేక సూక్తాలను రచించారన్నారు. బౌద్ధ యుగం నుంచి తమిళ సంగం యుగం వరకు ఎందరో స్త్రీ రచయిత్రులు ఉన్నారన్నారు. వైష్ణవ సంప్రదాయంలో పాశురాలు రచించిన ఆళ్వారుల్లో దళితులు, స్త్రీలు కూడా ఉన్నారని వెంకయ్య నాయుడు చెప్పారు. పద్య సాహిత్యంలో రామాయణం రచించిన మొల్ల, సుభద్రా కల్యాణం రచించిన తాళ్లపాక తిమ్మక్క, అనేక కావ్యాలు, శతకాలు, యక్షగానాలు రచించిన తరిగొండ వెంగమాంబ, ప్రబంధ కవులతో పోటీ పడిన రంగాజమ్మ, ముద్దుపళని మొదలైన ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చని ఆయన గుర్తు చేశారు.

పెద్దవాళ్లు చెప్పిన మాటలన్నీ చాలా అర్థవంతమైనవని, ఏదో పాతచింతకాయ పచ్చడని తీసిపారేయకూడదని వెంకయ్య నాయుడు అన్నారు. ఆ పచ్చడి తింటే గదా, అది ఎంత రుచిగా ఉంటుందో తెలిసేదని ఆయన చమత్కరించారు. పెద్దవాళ్లు చెప్పిన మాటలన్నింటిలో శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం, వేల సంవత్సరాల నాటి అనుభవం ఇమిడి ఉంటాయన్నారు.ప్రజల్ని పుస్తకాలు చదివించే దిశగా నడిపించడమే కాక, మంచి పుస్తకాలు చదివించేలా పుస్తకోత్సవాలు తోడ్పడతాయని వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రతి ఏటా జరిగే ఈ పుస్తకోత్సవాలకు వేలాది మంది హాజరవుతున్నారని, పెద్ద ఎత్తున పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారని తెలిసి ఎంతో సంతోషపడుతున్నానన్నారు. తెలుగు భాష ప్రత్యేకతను జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి, తెలుగు భాష అభివృద్ధికి నిరంతరం తపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఈ పుస్తకోత్సవం ఒక నివాళిగా భావించాలని వెంకయ్య నాయుడు అన్నారు.

ఈ పుస్తక మహోత్సవం కార్యక్రమానికి మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ బి.లక్ష్మీ కాంతం, విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్ పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.