దటీజ్ సుబ్బారావు…

12 December, 2019 - 8:20 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఒక మనిషి.. భిన్న పార్శ్వాలుగా ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. వారి కోవలోకి వస్తారు…. గొల్లపూడి మారుతీరావు. నాటక రచయితగా… నవలా రచయితగా… పాత్రికేయుడిగా… ఆల్ ఇండియా రేడియో ఉద్యోగిగా… వెండి తెర నటుడిగా.. బుల్లి తెర నటుడిగా… వక్తగా… కాలమిస్టుగా.. ఏ రంగంలో అడుగు పడితే.. ఆ రంగంలో తనదైన శైలిలో దూసుకెళ్లడమే కాదు….. ఆ రంగానికి వన్నె తెచ్చారు.. ఈ గొల్లపూడి. గత కొద్ది రోజులుగా అస్వస్థులుగా ఉన్న ఆయన గురువారం చెన్నైలో కన్నుమూశారు.

కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య.. చిత్రంలో గొల్లపూడి తెరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో సుబ్బారావు పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించారు. అంతేకాదు… దటీజ్ సుబ్బారావు అంటూ ఆయన పలికే డైలాగ్ మాడ్యులేషన్ తో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం తర్వాత గొల్లపూడి మళ్లీ వెను తిరిగి చూసుకోలేదు. ఆ సినిమా తర్వాత ఆయనకు సినిమా ఛాన్స్ లు వెల్లువెత్తాయి. అలా… ఆయన దాదాపు 290 చిత్రాల్లో నటించారు. సంసారం ఒక చదరంగంలో అప్పల నర్సయ్యగా… ఛాలెంజ్ సినిమాలో సిల్క్ స్మిత భర్తగా… సుందరాకాండలో సింగిల్ పూరీ శర్మగా… వారసుడొచ్చాడు, ఆదిత్య 369, మురారి, బ్రోకర్, కంచె… ఇలా పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేశారు.

అలాగే గొల్లపూడి 1963లో డాక్టర్ చక్రవర్తి సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా…. 1965లో ఆత్మగౌరవం చిత్రానికి ఉత్తమ రచయితగా నంది పురస్కారాలను అందుకున్నారు. అదేవిధంగా 1989లో గొల్లపూడి రచించిన కళ్లు అనే నాటకాన్ని… ప్రముఖ కెమెరామెన్ ఎం వి రఘు దర్శకత్వంలో సినిమాగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి కూడా ఉత్తమ రచయితగా ఆయనకు నంది పురస్కారం లభించింది. 1987లో సంసారం ఒక చదరంగం సినిమాలో ఉత్తమ క్యారక్టర్ నటుడిగా ఎంపికయ్యారు. 1991లో మాస్టారి కాపురం సినిమాకు ఉత్తమ సంభాషణల రచయితగా నంది అవార్డు దక్కించుకున్నారు.

ఇక విదేశాల్లో సైతం ఆయన లెక్కలేనన్ని బిరుదులు, సత్కారాలు పొందారు. 14 ఏళ్ల వయస్సులో గొల్లపూడి ఆశాజీవి అనే కథను రాశారు. ఈ కథను ప్రొద్దుటూరులో స్థానిక పత్రిక రేనాడు దానిని ప్రచురించింది. గొల్లపూడి రాసిన కవిత్వం మారుతీయంగా సంపూటాలుగా వెలువడింది. గొల్లపూడి మొత్తం 12 నవలలు, 4 కథా సంపుటాలు, 3 పిల్లల కథలు రాశారు. జీవన కాలం పేరుతో అనేక వ్యాసాలు సైతం రాశారు. అమ్మకడుపు చల్లగా పేరుతో గొల్లపూడి ఆత్మకథ రాసుకున్నారు.

1939 ఏప్రిల్ 14న విజయనగరంలో అన్నపూర్ణ, సుబ్బారావు దంపతులకు అయిదో సంతానంగా గొల్లపూడి మారుతీరావు జన్మించారు. విశాఖపట్నం సీబీఎం ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాలతోపాటు ఆంధ్రయూనివర్సిటీలో ఆయన విద్యనభ్యసించారు. బీఎస్సీ ఆనర్స్ పూర్తి చేసిన ఆయన 1959లో ఆంధ్రప్రభలో ఉప సంపాదకుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రేడియోలో ట్రాన్స్ మిషన్ ఎగ్జిక్యూటీవ్ గా ఎంపికయ్యారు గొల్లపూడి.

1961 నవంబర్ 11న హనుమకొండలో శివకామసుందరితో గొల్లపూడి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం…. సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. గొల్లపూడి కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేమపుస్తకం చిత్రం విశాఖ బీచ్ లో షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో శ్రీనివాస్ మృతిచెందారు. ఈ సంఘటన గొల్లపూడి మారుతీరావు జీవితంలో కొలుకోలేని దెబ్బ అని ఆయన సన్నిహితులు చెబుతారు.

ఆ తర్వాత గొల్లపూడి శ్రీనివాస్ పేరిట గొల్లపూడి మారుతీరావు పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ పురస్కారాన్ని దేశంలోని వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన సునీల్ దత్, నసీరుద్దీన్ షా, మృణాల్ సేన్, శ్యాం బెనగల్, జావేద్ అక్తర్, అనుపమ్ ఖేర్, అమీర్ ఖాన్ తదితరులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వెండి తెరపైనే కాదు… బుల్లి తెరపై తన ప్రతిభ పాటవాల్ని ప్రదర్శించి.. ఇలా వెళ్లిపోవడం గొల్లపూడి అభిమానులే కాదు టాలీవుడ్ సైతం జీర్ణించుకోలేక పోతుంది.