హైదరాబాద్‌లో ‘నారప్ప’

18 March, 2020 - 9:04 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రంలోని పలు సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ ఫిబ్రవరి మొదటి వారంలో తమిళనాడు వెళ్లింది. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని.. మంగళవారం రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చింది. అయితే కరోనా వైరస్ కారణంగా.. ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మొదలవుతుందని సమాచారం. తమిళంలో సూపర్ డూపర్ హిట్ సాధించిన అసురన్ చిత్రానికి నారప్ప రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

కాగా ఈ చిత్రాన్ని మే 8వ తేదీన విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కానీ కరోనా వైరస్ కారణంగా షూటింగ్ అలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విడుదల తేదీ కూడా వాయిదా పడే అవకాశం ఉందని ఫిలింనగర్‌లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో వెంకటేశ్ పక్కన ప్రియమణి నటిస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సురేశ్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ అనంతపురంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.