ఆ సెంటిమెంట్ వర్కౌట్‌ కానుందా?

06 October, 2017 - 10:06 AM


హిందీలో ఘనవిజయం సాధించిన ‘హిందీ మీడియం’ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ కానుందని గతకొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. హిందీలో ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను 12 కోట్లతో నిర్మించగా.. దాదాపు 100 కోట్లు వసూలు చేసింది. హిందీ మీడియం చదువుకున్న తల్లితండ్రులు తమ కూతుర్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్చించడానికి ఎలాంటి కష్టాలు పడ్డారనేదే ఈ సినిమా కథాంశం.

అయితే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి పలువురు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. తెలుగులో లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వెంకటేష్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వంలో ‘దృశ్యం’, సుధ కొంగర దర్శకత్వంలో చేసిన ‘గురు’ చిత్రాలు భారీ విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు కూడా రీమేక్‌లు కావడం విశేషం. ఇపుడు నందినీ రెడ్డి దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘హిందీ మీడియం’ రీమేక్ అయితే భారీ విజయం సాధిస్తుందనే సెంటిమెంట్ సినీజనాల్లో మొదలయ్యింది. అయితే ఈ రీమేక్‌కు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.