మంత్రి సంజీవ్‌కు వెంకయ్య వార్నింగ్

19 July, 2019 - 10:02 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: రాజ్యసభకు గైర్హాజరై సభా సమయాన్ని వృథా చేశారంటూ కేంద్ర పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి సంజీవ్‌ కుమార్‌ బలయాన్‌పై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదం పునరావృతం చేయవద్దంటూ హెచ్చరించారు. రాజ్యసభ బుధవారం నాటి ఎజెండాలో మంత్రి బలయాన్ పేరు ఉన్నప్పటికీ ఆయన సభకు రాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం సభాపతి స్థానంలో ఉన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ…‘ మంత్రి గారు.. మొన్నటి ఎజెండాలో మీ పేరు ఉంది. కానీ మిమ్మల్ని పిలిచినపుడు అందుబాటులో లేరు. భవిష్యత్తులో ఇంకోసారి ఇలా చేయకండి’ అని బలయాన్‌ను హెచ్చరించారు. ఇందుకు స్పందించిన మంత్రి గైర్హాజరీ పట్ల విచారం వ్యక్తం చేశారు.

కాగా.. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న మోదీ.. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రుల గురించి ఆరా తీశారు. పార్లమెంట్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలకు కేబినెట్ మంత్రులు కాకుండా.. సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడం, మరికొంత మంది​ తమ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు గానీ, సభ్యులు ప్రశ్నిస్తున్నప్పుడు గానీ సభలో లేకపోవడం పట్ల మోదీ అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరవ్వని మంత్రుల పేర్ల జాబితాను తనకు అందజేయాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని మోదీ ఆదేశించారు.