‘పోలవరం’కి సహకరించండి

14 June, 2019 - 8:35 PM

(న్యూవేవ్వ్ డెస్క్)

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్యతో కేంద్ర మంత్రి షెకావత్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన చరిత్రను మంత్రి షెకావత్‌కు వివరించారు. పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఏపీకి సంపూర్ణ సహకారం అందించాలన్న మంత్రికి వెంకయ్య విజ్ఞప్తి చేశారు. గోదావరి, పెన్నా నదులను కావేరితో అనుసంధానం చేయాల్సన అవసరం ఉందని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య అభిప్రాయపడ్డారు.

ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ అభివృద్ధికి నదుల అనుసంధానం అవసరం ఆయని పేర్కొన్నారు. రూ. 3 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిందని ఈ సందర్భంగా షెకావత్‌కు వెంకయ్య గుర్తు చేశారు. ఈ మొత్తన్ని నాబార్డు ద్వారా విడుదల చేసేందుకు చొరవ తీసుకోవాలన్న మంత్రికి వెంకయ్య సూచించారు.

నిధులు లేక ప్రాజెక్టు ఆలస్యం కాకూడదన్నదే తన ఆకాంక్ష అని మంత్రికి వెంకయ్య వివరించారు. ప్రాజెక్టు విస్తరణలో అడ్డంకులపై పర్యావరణ శాఖలో మాట్లాడాలని మంత్రికి ఈ సందర్భంగా వెంకయ్య సూచించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచనలపై మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. ఆర్థిక శాఖతో చర్చించి సానుకూల చర్యలు చేపడతామని వెంకయ్యకు గజేంద్ర షెకావల్ తెలిపారు.