‘అవసరం ఏమిటి’

16 November, 2019 - 4:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నెల్లూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం మంచి విషయమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు.  ఆంగ్లమధ్యామన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శనివారం నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లాయపల్లిలో నీటిశుద్ధి కేంద్రాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి ఆంగ్ల భాష అవసరం అని ఆయన స్పష్టం చేశారు. మనిషి అభివృద్ధి చెందడానికి ఆంగ్ల భాష అవసరమని ఆయన తెలిపారు. తెలుగును పూర్తిగా తొలగించడం లేదు కదా… వ్యతిరేకత ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.

పాఠశాల స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని వైయస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కూడా దశల వారిగా అమలు చేస్తామని ప్రకటించింది. అయితే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై విపక్షాలు.. వైయస్ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి.  పాఠశాలల్లో తెలుగు మాద్యమం కొనసాగించాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు.. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం  తెలుగు మాద్యమంలోనే భాష కొససాగించాలని వైయస్ జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.