‘క్రిమినల్ కేసులు తప్పవు’

16 November, 2019 - 5:33 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తోపాటు ప్రభుత్వంపై మతపరమైన ఆరోపణలు చేసే వారిపై క్రిమినల్ కేసులు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయా శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. రాష్ట్రంలోని పుణ్య క్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇవి పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.

ఈ అంశంపై చర్చకు సిద్ధమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విపక్షాలకు సవాల్ విసిరారు. శనివారం తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విలేకర్లతో మాట్లాడుతూ… సీఎం వైయస్ జగన్‌పై మత ప్రచారం చేసి.. బీజేపీకి మళ్లీ దగ్గర అయ్యేందుకు విపక్ష నేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. సీఎం వైయస్ జగన్‌ని ఎదుర్కో లేక.. చంద్రబాబు విమర్శులు గుప్పిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఇప్పటికే ఇతర రాష్ట్రాల దృష్టి పెట్టాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబు నవంబర్ 14న ఇసుక దీక్ష చేస్తే… అందుకు ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే మద్దతు కూడగట్టుకోలేక పోయారని మంత్రి వెల్లంపల్లి వ్యంగ్యంగా అన్నారు.

రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లో రూ. 234 కోట్లు కేటాయించిందని ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద, పార్టీ మీద, ఆయన ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నాలు చేస్తున్నారని.. ఎవరైనా హద్దు మీరి ఇటువంటివి చేస్తే.. అదీ సోషల్ మీడియాలో నైనా సరే.. ఉపేక్షించే ప్రసక్తే లేదని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు.