ఎఫ్2 సినిమా రివ్యూ!

12 January, 2019 - 4:36 PM

సినిమా: ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)
జానర్: కామెడీ ఎంటర్‌‌టైనర్‌
నటీనటులు: వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌‌రాజ్‌, ప్రగతి, ఝాన్సీ, వెన్నెల కిషోర్, ప్రియదర్శిన పులికొండ, అనసూయ భరద్వాజ్, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై విజయ, నాజర్.
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
నిర్మాత: దిల్‌ రాజు
సినిమాటోగ్రఫి: సమీర్‌రెడ్డి
ఎడిటింగ్: తమ్మిరాజు
ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్
బ్యానర్: వెంకటేశ్వర క్రియేషన్

విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. వరుణ్ తేజ్ యూత్‌‌ను ఆకట్టుకునే హీరో. వీరి కాంబో‌లో వచ్చిన చిత్రం ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). బొమ్మరిల్లు, శతమానం భవతి లాంటి ఫీల్‌‌గుడ్ మూవీల్ని అందించిన నిర్మాత దిల్ రాజు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మరో కామెడీ ఎంటర్‌‌టైనర్‌ ఎఫ్‌ 2. మల్టీస్టారర్‌‌గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి బరిలో భారీ పోటీ మధ్య శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సంక్రాంతి బరిలో తాజాగా విడుదలైన సినిమాలకు డివైడ్‌ టాక్‌ రావటంతో ఎఫ్‌ 2 ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి నెలకొంది. చాలా కాలం తరువాత వెంకటేష్ ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ రోల్‌‌లో కనిపించటం, వరుణ్‌ తేజ్‌ తొలిసారిగా మల్టీస్టారర్‌ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఎఫ్‌ 2 అందుకుందా? వెంకటేష్, వరుణ్ కాంబినేషన్ వర్కవుట్ అయిందా? తమన్నా, మెహ్రీన్ అందాలు ఆకట్టుకున్నాయా? దిల్ రాజు, అనిల్ రావిపూడి ఖాతాలో విజయం చేరిందా అని తెలుసుకుందాం.

స్టోరీ:
ఎమ్మెల్యే (రఘుబాబు) దగ్గర వెంకీ (వెంకటేష్‌) పీఏ. వెంకీకి అమ్మా నాన్నలతో పాటు అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు కూడా లేరు. హారిక (తమన్నా) వెంకీని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తరువాత వెంకీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అప్పటి వరకు తనకు నచ్చినట్టు గడిచిపోతున్న వెంకీ జీవితం.. భార్య, అత్తమామల రాకతో నరకంగా మారిపోతుంది. హారిక చెల్లెలు హని (మెహరీన్‌). కాలేజిలో చదువుతున్న హనీని వరుణ్‌ యాదవ్‌ (వరుణ్‌ తేజ్‌) ఇష్టపడతాడు. వెంకీ వద్దని వారిస్తున్నా వినకుండా వరుణ్‌, హనీతో పెళ్లికి రెడీ అవుతాడు. వరుణ్ జీవితం పెళ్లి కాకుండానే హనీ చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో వెంకీ, వరుణ్‌‌లలో ఫ్రస్ట్రేషన్‌ పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఎదురింటి వ్యక్తి (రాజేంద్రప్రసాద్‌) చెప్పిన మాటలు విని వెంకీ తన భార్యను, వరుణ్‌ తనకు కాబోయే భార్యను వదిలేసి యూరప్‌ వెళ్లిపోతారు. తాము దూరమైతే భార్యలు కాళ్లభేరానికి వస్తారని అనుకుంటారు. వరుణ్, వెంకీ, రాజేంద్రప్రసాద్ యూరప్‌‌‌లో ఓ కేసులో ఇరుక్కుంటారు. తర్వాత భర్తను, ప్రియుడ్ని వెతుకుంటూ అక్కాచెల్లెళ్ళు యూరప్ వచ్చి దొరస్వామి (ప్రకాశ్ రాజ్) ఇంట్లో చేరతారు. హారిక, హనీ దొరస్వామి నాయుడు కొడుకుల్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతారు.

ఈ కథలో దొరస్వామి నాయుడి పాత్ర ఏంటి? భర్తను, ప్రియుడ్ని వదలేసి దొరస్వామి కొడుకుల్ని తమన్నా, మెహ్రీన్ ఎందుకు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. భార్య, ప్రేయసి పెళ్లిని చెడగొట్టడానికి వెంకీ, వరుణ్ ఎలాంటి ఎత్తులు వేశారు? ఈ కథలో నూతన్ నాయుడు, వెన్నెల కిషోర్ దొరైస్వామిని ఎందుకు చంపాలని ప్రయత్నిస్తుంటారు. అనసూయ పాత్ర కథకు ఎలా కీలకంగా మారింది? చివరికి భార్య, ప్రేయసిలను వెంకీ, వరుణ్ ఎలా దక్కించుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా.

న‌టీన‌టులు:
విక్టరీ వెంకటేష్‌ చాలా కాలం తరువాత తన కామెడీ టైమింగ్‌‌తో ఆకట్టుకున్నాడు. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. పెర్ఫామెన్స్‌, డైలాగ్‌ డెలివరీ, కామెడీ ఇలా ప్రతీ దాంట్లో వెంకీ సూపర్బ్‌ అనేలా చేశాడు. వరుణ్ తేజ్‌ కూడా బోరబండ వరుణ్‌‌గా వరుణ్ తెలంగాణ భాషతో మంచి నటనతో ఆకట్టుకున్నాడు. వరుణ్ చెప్పే తెలంగాణ డైలాగుల్లో పూర్తి స్వచ్ఛత లేకపోయినా ఇంచుమించు మెప్పించాడనే చెప్పొచ్చు. వెంకీ పక్కన జూనియర్ అనే ఫీలింగ్ కనిపించకుండా డైలాగ్స్‌, యాక్షన్‌‌తో ఫటాఫట్‌మనిపించాడు. మాస్, కామెడీ పాత్రలకు తాను ఏమాత్రం తీసిపోనని వరుణ్ నిరూపించుకొన్నాడు. కామెడీ పరంగా మంచి మార్కులే పొందాడు.హారిక పాత్రలో తమన్నా ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత లీడ్ హీరోయిన్‌‌గా ఆమె అలరించింది. తమన్నా, మెహ్రీన్ తెర మీద అందాలను కుమ్మరించడమే కాకుండా అభినయంతోనూ ఆకట్టుకొన్నారు. సీనియర్ నటుల మధ్య తమన్నా, మెహ్రీన్ మరోసారి మంచి నటన కనబరిచారు. ఫస్ట్ హాఫ్‌‌లో మరో హీరోయిన్‌ మెహరీన్‌ నటన కాస్త అతిగా అనిపించినా ముందు ముందు పరవాలేదనిపిస్తుంది. గ్లామర్‌ షోలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటీ పడ్డారనే చెప్పాలి. ఇతర పాత్రల్లో రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌‌రాజ్‌, ప్రగతి, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌ తమ వంతుగా నవ్వించే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్‌లో నాజర్‌ ఎంట్రీ, ఆయన చెప్పే డైలాగ్స్‌ ఆలోచింప చేస్తాయి.

విశ్లేష‌ణ‌:
ఎఫ్2 కథను అల్లుకోవడంలో గానీ, కథలో పలు పాత్రలను జొప్పించి, సినిమాను ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా చేయడంలో దర్శకుడు అనిల్ రావిపూడి రాసుకొన్న స్ట్రిప్టు, డైలాగ్స్ అదుర్స్ అనిచెప్పవచ్చు. పాత్రల మధ్య సమతూకం పాటించిన తీరును అభినందించాల్సిందే. సంక్రాంతి పండక్కి ఓ మంచి కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌తో అనిల్ రావివూడి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మల్టీస్టారర్‌‌లో ఉండే ఇబ్బందులు ఎక్కడా కనిపించకుండా అనిల్ తన ప్రతిభకు పదునుపెట్టాడని చెప్పవచ్చు. ఎఫ్2లో చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. ఏ పాత్రకు కూడా అన్యాయం చేసినట్టు కనిపించదు. అదే సినిమాను హాస్యంతో పరుగులు పెట్టించడానికి కారణమైంది. ఈ సినిమా విజయంలో నూటికి నూరు పాళ్ల క్రెడిట్ అనిల్ రావిపూడిదే అని చెప్పొచ్చు.ప్రతీ ఇంట్లో నిత్యం జరిగే సన్నివేశాల నుంచే అనిల్ రావిపూడి కామెడీ పుట్టించాడు. భార్యా భర్తల మధ్య జరిగే గొడవలు, వాటి పరిణామాలు, పుట్టింటి వారి మాటలు ఇలా ప్రతీది ఎంతో ఫన్‌ క్రియేట్ చేసింది. రచయితగా కూడా అనిల్ రావిపూడి ఫుల్‌ మార్క్‌ సాధించాడు. అనిల్ రాసిన డైలాగ్స్‌ చాలా బాగున్నాయి. తొలి భాగాన్ని ఏమాత్రం పట్టు తప్పకుండా ఫన్‌ రైడ్‌లా నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కొద్దిగా నెమ్మదించాడు.

సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. తెరనిండా పాత్రలను నింపండంలో అద్భుతమైన బ్యాలెన్స్ కనిపించింది. ఉపయోగించిన కలర్ ప్యాటర్న్ తెరను మరింత అందంగా మార్చింది. యూరప్‌‌లో చిత్రీకరించిన సన్నివేశాలు కన్నుల పండువగా ఉన్నాయి. ప్రకాష్‌రాజ్ ఇంటిని డిజైన్ చేసిన ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ విభాగం వర్క్ బాగుంది. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు పరవాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్‌ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. దిల్ రాజు నిర్మాణ విలువలు చాలా రిచ్‌‌గా ఉన్నాయి. పాత్రలను నింపడంలోనూ, సన్నివేశాలను అందంగా తీర్చడానికి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని ఫీలింగ్ కలుగుతుంది.

చివరిగా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, కలహాలు కలబోసి వడ్డించిన సినిమా ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). సంక్రాంతి పండుగ పూట కావాల్సినంత వినోదం ఈ సినిమాలో దొరుకుతుందనేది గ్యారెంటీ. ఫ్యామిలీ ఆడియెన్స్‌‌కు మంచి సంతృప్తి ఇచ్చే విందు భోజనంలా ఉంటుంది. కుటుంబ సమేతంగా వెళ్లి ఎలాంటి చీకూ చింతా లేకుండా చూసే సినిమా ఎఫ్2.

బలాలు:
వెంకటేష్, వరుణ్ నటన
తమన్నా, మెహ్రీన్ గ్లామర్
హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ
కథ, కథనాలు
అనిల్ రావిపూడి స్క్రిప్టు
సినిమాటోగ్రఫీ
మాటలు
బలహీనతలు:
సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు
ద్వితీయార్థంలో నిడివి
పాటలు