ట్రైలర్‌లో ‘గద్దలకొండ గణేష్’

09 September, 2019 - 5:48 PM

(న్యూవే్వ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్ర ట్రైలర్ సోమవారం విడుదల చేశారు. ఈ మధ్య కాలంలో.. ఇంటిల్లిపాది కలసి చూసే సినిమాలు ఎక్కడొస్తున్నాయి అంటూ ట్రైలర్ ప్రారంభమైంది.

గద్దల కొండ గిరిష్ అంటే గజ గజ గజ వణకాలే అంటూ ఈ చిత్రంలో తన పాత్ర పేరును వరుణ్ తేజ్ చెప్పే తీరు  ఈ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది. అలాగే మనం బతుకున్నామని పది మందికి తెలవకపోతే.. మన బతుకెందుకురా, జిందగీ మాదచ్చేద్ తమ్మి.. ఉత్త గీతలే మన చేతుల్లో ఉంటాయి.. రాతలు మన చేతలో ఉండయి, గవాస్కర్ సిక్స్ కొట్టుడు, బప్పిలహరి పాట కొట్టుడు, నేను బొక్కలిరకొట్టుడు సేమ్ టు సేమ్ అంటూ వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్‌లు మాస్ ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అంతే కాదు.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి, శోభన్ బాబు జంటగా నటించిన చిత్రం దేవత. ఈ చిత్రంలో సూపర్ డూపర్ హిట్ సాంగ్.. వెల్లువెత్తి గోదారమ్మ వెల్లకిల్లా పడ్డాదమ్మ.. అంటూ పాట తాలుక మ్యూజిక్ బ్యాగ్ గ్రౌండ్‌లో రావడం ఈ ట్రైలర్‌కే కిక్కించ్చింది.

ఈ వాల్మీకి చిత్రం సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తమిళంలో విజయం సాధించిన జిగర్తండ చిత్రాన్ని తెలుగులో వాల్మీకిగా రీమేక్ చేస్తున్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.