హాఫ్ మిలియన్ దాటేసిన ‘తొలిప్రేమ’ కలెక్షన్లు!

12 February, 2018 - 12:29 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార రాశీఖన్నా నటించిన చిత్రం ‘తొలిప్రేమ’. ఈ మూవీ ఫిబ్రవరి 10న విడుదలై సుపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇండియాలో కంటే ఒక రోజు ముందుగానే ఓవర్‌సీస్‌లో విడుదలై.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రహ్మాండమైన స్పందనను దక్కించుకుంది. ఉదయం మార్నింగ్ షో నుండే అన్ని ఏరియాల్లో మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో సినిమా హిట్‌గా నిలిచింది. దీంతో 2018లో మెగా ఫ్యామిలీ నుండి తొలి హిట్ అందుకున్న ఘనత వరుణ్ తేజ్‌కు దక్కింది.

సినిమా సినిమాకు మధ్యన వరుణ్ తేజ్ చూపిస్తున్న కథలోని భిన్నత్వం, నటనలో పరిణితి ప్రేక్షకుల్ని, మెగా అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఫిదా మూవీతో వరుణ్ తేజ్ తొలి సూపర్ హిట్ అందుకున్నా… అందులో హీరోయిన్ సాయి పల్లవి ఎక్కవ క్రెడిట్ కొట్టేసిందే. అయితే తాజా తొలిప్రేమ మూవీతో వరుణ్ అదిరిపోయే హిట్‌ను అందుకున్నాడు. ఈ మూవీ కలెక్షన్లలోనూ దూసుకుపోతోంది.

ముఖ్యం యూఎస్‌లో ప్రీమియర్ల ద్వారా 1.52 లక్షల డాలర్లు రాబట్టిన ఈ సినిమా తొలి రోజుకి 2.91 లక్షల డాలర్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం యూఎస్‌లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కును వేగంగా అందుకుంది. విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు 5 లక్షల డాలర్లను వసూలు చేసింది. సినిమాకున్న పాజిటివ్ టాక్‌ను చూస్తే ఇంకొద్దిరోజుల్లోనే మిలియన్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.వరుణ్ తేజ్ గత చిత్రం ‘ఫిదా’ ఫుల్ రన్‌లో 2.03 మిలియన్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. తొలిప్రేమ నిర్మాణ సంస్థ లెక్కలు ప్రకారం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 9 కోట్ల పై చిలుకు గ్రాస్ వసూలు చేసిందీ సినిమా. కలెక్షన్లు స్థిరంగా ఉండటంతో వరుణ్ కె రీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా తొలిప్రేమ నిలిచే అవకాశముందని సినీ పండితులు భావిస్తున్నారు.

కథలో దమ్ము ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుందని తొలి ప్రేమ చిత్రం నిరూపించింది. యువతను ఆకట్టుకునే ప్రేమకథ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. సుహాసిని, నరేష్, ప్రియదర్శి, హైపర్ ఆది ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీతో వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచమయ్యాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు.