‘గద్దలకొండ గణేష్’గా వరుణ్‌తేజ్ ’వాల్మీకి’

20 September, 2019 - 7:53 AM

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ హీరోగా హరీశ్‌శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వాల్మీకి’. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై గోపీ ఆచంట, రామ్‌ ఆచంట ఈ మూవీని నిర్మించారు. పూజా హెగ్డే, అధర్వ మురళి ముఖ్య పాత్రల్లో నటించారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సినిమా టైటిల్‌ (వాల్మీకి) మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దాంతో చిత్ర బృందానికి హైకోర్టు నోటీసులు పంపింది. నోటీసులకు వివరణ ఇచ్చిన చిత్ర బృందం.. టైటిల్‌ను మారుస్తామని హైకోర్టుకి తెలియజేసింది. ‘వాల్మీకి’ టైటిల్‌ను ‘గద్దలకొండ గణేశ్‌’గా మారుస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాలో గద్దలకొండ గణేశ్‌ పాత్రలో వరుణ్‌తేజ్‌ నటించారు. తమిళ ‘జిగర్తండా’ సినిమాకు ఈ మూవీ రీమేక్‌.అయితే.. వాల్మీకి టైటిల్ వివాదంపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. బోయ, వాల్మీకి సామాజికవర్గం నుంచి వ్యక్తమైన ఆందోళన నేపథ్యంలో ఈ మూవీ టైటిల్ ను గద్దలకొండ గణేశ్ గా మారుస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ శంకర్ మాట్లాడారు. వాల్మీక్ టైటిల్ ప్రకటించినప్పటి నుంచీ కొన్ని వర్గాలు నిరసనలు చేపట్టారన్నారు. తమ సినిమాలో వాల్మిక మహర్షి తప్పు చేసినట్లు ఎక్కడా చూపించలేదని వివరణ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్‌ ను మార్చిల్సి రావడంతో తాను తొలిసారిగా ఓడిపోయాననిపిస్తోందన్నారు. ఓడిపోవడం అంటే.. వ్యక్తిగానో, డైరెక్టర్ గానో.. రైటర్ గానో కాదని, ఒక హైందవ సమాజానికి చెందిన వ్యక్తిగా వాల్మీకి మహర్షి మీద ఉన్న గొప్ప గౌరవాన్ని, ఓ మంచి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో తాను ఓడిపోయాననిపిస్తోందన్నారు.

ఇలా ఉండగా ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో రిలీజ్‌ను ఆపేయాలంటూ అనంతపురం, కర్నూలు జిల్లా కలెక్టరేట్‌ల నుంచి తమకు ఉత్తర్వులు వచ్చాయిన హరీశ్ శంకర్ తెలిపారు. వాల్మీకి టైటిల్‌ను గద్దలకొండ గణేశ్‌గా పరిగణించాలని ఆయన అన్నారు.