ముద్దు పెడితే ఏడుస్తారా..

14 February, 2020 - 5:12 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: శేఖర్ కమ్ముల చిత్రం అంటేనే వాస్తవికతకు అద్దం పడుతోంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలే అందుకు ఉదాహరణ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం లవ్ స్టోరీ.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని అయ్ పిల్లా.. అంటూ సాగే మ్యూజికల్ ప్రీవ్యూను ప్రపంచ ప్రేమికుల దినం ఫిబ్రవరి 14వ తేదీ సందర్భంగా విడుదల చేశారు. ‘ముద్దు పెడితే ఏడుస్తారా.. అబ్బా’ అంటూ ఈ పాటలో చివరిలో నాగ చైతన్యను సాయి పల్లవి అడగడం గమ్మత్తుగా ఉంది.

ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని మ్యూజికల్ ప్రీవ్యూ విడుదలయ్యింది. ఈ పాటకు సాహిత్యాన్ని చైతన్య పింగళి అందించగా.. హరిచరణ్ ఈ గీతాన్నిఆలపించారు. ఈ చిత్రానికి పవన్ సంగీతం అందించారు.

నారాయణ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాయి పల్లవి ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదాలో భానుమతి పాత్రలో ఒదిగిపోయి నటించింది. గతంలో నాగ చైతన్య ప్రేమమ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి కూడా నటించిన విషయం విదితమే.