కిమ్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ థ్యాంక్స్!

13 June, 2018 - 2:08 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సింగపూర్: ప్రపంచం మొత్తం వేయి కళ్ళతో ఎదురుచూసిన ట్రంప్- కిమ్ శాంతి సమావేశ ఘట్టం ముగిసింది. ఒకరిపై మరొకరు ఉప్పు, నిప్పులా చిటపటలాడే అమెరికా, ఉత్తరకొరియా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఎట్టకేలకు పూర్వపు వైరాలను పక్కన పెట్టి ఒకరికొకరు స్నేహహస్తాన్ని అందుకున్నారు. సింగపూర్‌ వేదికగా జరిగిన ట్రంప్‌- కిమ్‌ భేటీ ఫలవంతం కావడంతో ఇరువరు నేతలూ తమ స్వదేశాలకు తిరుగుపయనం అయ్యారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్విట్టర్‌ వేదికగా కిమ్‌‌కు థ్యాంక్స్ చెప్పారు.

‘ఉత్తర కొరియా ప్రజల నూతన భవితవ్యం కోసం ధైర్యంగా ముందడుగు వేసిన చైర్మన్‌ కిమ్‌‌కు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. నిజమైన మార్పు అనేది సాధ్యమేనని మా తొలి భేటీ నిరూపించింది. అణు విపత్తుకు వెనుకడుగు పడింది. ఇకపై రాకెట్ల ప్రయోగాలు, అణుపరీక్షలు, అధ్యయనాలు ఉండబోవు. బందీలు తమ స్వదేశాలకు వెళ్లొచ్చు. థాంక్యూ కిమ్‌. మన కలయిక చరిత్రాత్మకం’ అని ట్విట్టర్‌‌లో ట్రంప్ పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌ను ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్ తమ దేశానికి ఆహ్వానించారు. భేటీ సమయంలోనే ట్రంప్‌‌ను కిమ్ ఆహ్వానించగా అందుకు ట్రంప్ కూడా ఒప్పుకున్నారని ప్యాంగ్యాంగ్‌ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ బుధవారం వెల్లడించింది. సింగపూర్‌ వేదికగా జరిగిన భేటీలో పూర్తిస్థాయి అణు నిరాయుధీకరణకు కిమ్‌ అంగీకరించిన విషయ తెలిసిందే.

సింగపూర్ భేటీ సందర్భంగానే తమ దేశాలకు రావాలంటూ ట్రంప్‌, కిమ్‌ ఒకరినొకరు ఆహ్వానించుకున్నారని కేసీఎన్‌ఏ పేర్కొంది. ఈ ఆహ్వానాలకు ఇద్దరూ అంగీకరించినట్లు తెలిపింది. భేటీ సఫలమైతే కిమ్‌‌ను అమెరికాకు ఆహ్వానిస్తానని గతంలో ట్రంప్‌ చెప్పిన విషయం తెలిసిందే.
ట్రంప్‌- కిమ్‌ భేటీని ఓ పెనుమార్పుకు ఆరంభంగా వర్ణించింది ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్‌ఏ. ఉత్తరకొరియా, అమెరికా మధ్య యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఇకపై మారతాయని పేర్కొంది.