చిన్నారులపై అత్యాచారం చేస్తే.. ఇక ఉరే!

11 July, 2019 - 8:10 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: చిన్నారులను లైంగిక దాడుల నుంచి కాపాడే చట్టం–2012 (పోక్సో)కు కేంద్రం పలు సవరణలు చేసింది. ఇకపై చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీ వివరాలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాకు వెల్లడించారు. చిన్నారులపై అత్యాచారాలతో పాటు మైనర్లపై లైంగికదాడులకు పాల్పడే వారినీ కఠినంగా శిక్షించాలని ఈ సవరణల్లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. మరోవైపు, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) సంస్థ చట్టబద్ధమైనది కాదని ప్రకటన చేసింది. పంజాబ్‌ సహా పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

చైల్డ్‌ పోర్నోగ్రఫీని పూర్తిగా నిర్మూలించేందుకు, ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న వారికి భారీ ఎత్తున జరిమానాలతో పాటు జైలుశిక్ష విధించేలా పోక్సో చట్టంలో మార్పులు చేసినట్లు జవదేకర్ చెప్పారు. కఠినమైన శిక్షల ద్వారానే చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు అత్యాచారాలను అదుపు చేసేందుకు వీలవుతుందని కేంద్రం భావిస్తోందదన్నారు. ఇందుకోసం పోక్సో చట్టంలోని 2,4,5,6,9,14,15,34,42,45 సెక్షన్లను కేంద్రం సవరించింది.

కాగా.. ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన మూడో విడతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధానత కోసం రూ.80,250 కోట్లతో 1.25 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 13 కేంద్ర కార్మిక చట్టాలను ఒకే కోడ్‌ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లు (కార్మికుల వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల బిల్లు – 2019) ‘కార్మిక రక్షణ కోడ్‌’కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల కార్మికులకు బీమా కవరేజీ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. పది కన్నా ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలకు ఈ కోడ్‌ వర్తిస్తుంది. వాణిజ్యం, వ్యాపారం, తయారీ, సేవ, ఐటీ వంటి అన్ని రంగాల కార్మికులకు ఈ ప్రయోజనాలు అందనున్నాయి. ఈ నిర్ణయం వల్ల కార్మికులు ఆరోగ్య రక్షణ, భద్రత వంటి ప్రయోజనాలు తద్వారా పొందవచ్చు. అంతర్రాష్ట్ర నదీ వివాదాల పరిష్కార చట్టసవరణ బిల్లును కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

దీంతో పాటు దేశవ్యాప్తంగా అక్రమ డిపాజిట్లను సేకరించే కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన ‘నియంత్రణ లేని డిపాజిట్ల పథకం రద్దు బిల్లు’కు కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. క్రమబద్ధీకరించని డిపాజిట్ల పథకం ఆర్డినెన్స్‌–2019 స్థానంలో ఈ బిల్లు అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రతిపాదిత బిల్లులో చట్ట విరుద్ధంగా డిపాజిట్లను పెంచితే అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తులకు శిక్ష, తిరిగి చెల్లించేందుకు తగిన నిబంధనలున్నాయి. ఉద్యోగులకు మెరుగైన సేవా ప్రయోజనాలు చేకూర్చేలా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు (ఆర్‌పీఎఫ్‌) ఆర్గనైజ్డ్‌ గ్రూప్‌–ఏ హోదాను కేంద్ర కేబినెట్‌ కల్పించింది.