డేరాలకు ఢోకా లేదు!

27 August, 2017 - 6:02 PM

భారత్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలన్న డిమాండ్‌పై బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ చేశాడని చెప్పే వ్యాఖ్య ఒకటి చాలా కాలంగా ప్రచారంలో ఉంది: (ఇండియాకు స్వాతంత్ర్యం ఇచ్చిన పక్షంలో) “అధికారం ధూర్తులు, మోసగాళ్లు, లుచ్ఛాల చేతికి వెళుతుంది. భారత రాజకీయ నాయకులు అందరూ దిగజారుడు మనుషులు, వ్యక్తిత్వం లేనివారు. అధికారం కోసం వాళ్లల్లో వాళ్లు తన్నుకోవడం తోనే సరి పోతుంది. ఇండియా రాజకీయ కలహాలలో మునిగిపోతుంది”.

ఈ మాటలు చర్చిల్ ఎప్పుడు అన్నాడో తెలియదు. అసలు అన్నాడో లేదో కూడా తెలియదు. చర్చిల్‌కు భారత రాజకీయ వ్యవస్థ మీద అంత ఘనమైన అభిప్రాయం లేదన్న సంగతి లోకవిదితం. మహాత్ముడిని అర్ధనగ్న ఫకీర్ అన్న చర్చిల్ ఈ మాటలు కూడా అని ఉంటాడులే అని సరిపెట్టుకుంటున్నారు. నిజానికి ఆయన ఆ మాటలు అన్నాడా లేదా అన్నది కాదు ఇక్కడ చర్చనీయాశం.

రేప్ కేసులో దోషిగా తేలిన తర్వాత గుర్మీత్ అరెస్టు

భారత రాజకీయ నాయకులు అలాంటి వ్యాఖ్యలకు అర్హులే అన్న అభిప్రాయం జనంలో క్రమంగా బలపడుతోంది. చర్చిల్ ఫొటో పక్కన ఆయన మాటలను రాసి, ఆ తర్వాత, “గత 70 ఏళ్లలో మనం ఆ మాటలను నిజం చేశాం” అని రాసి ఉన్న ఓ ఇంగ్లిష్ వాట్సాప్ మెసేజ్ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. హర్యానాలో చోటు చేసుకున్న హింసాకాండ నేపధ్యంలో ఈ వాట్సాప్ మెసేజ్ గుర్తు చేసుకోవాల్సి వచ్చింది.

డేరా మద్దతుదారుల అరాచకం

డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ వ్యవహారంలో చోటుచేసుకున్న హింస, విధ్వంసం దేశమంతటా మీడియాలో ప్రధాన చర్చనీయాంశం అయింది. సోషల్ మీడియా దీని గురించే హోరెత్తిపోతున్నది. గుర్మీత్‌ను, అతని శిష్యగణాన్ని తెగనాడుతున్నారు. వారిని సంఘవ్యతిరేక శక్తులుగా చిత్రిస్తున్నారు.

డేరా సచ్చా సౌదా వంటి శాఖలు చట్ట పాలనకు అతీతమనీ, తేడా వస్తే తీవ్రమైన అల్లకల్లోలాలకు దారి తీస్తాయనీ పాలకులకు తెలుసు. కానీ అవి ఢోకా లేని ఓటు బ్యాంకులని కూడా తెలుసు. బాబా ఒక్క మాట చెబితే చాలు, లక్షలాది అనుచరగణం ఓట్లు గంపగుత్తగా పడతాయి. ఈ వైరుధ్యాన్ని రాజకీయులు ఎలా పరిష్కరించాలి? ఎటు మొగ్గాలి? సమాజ శ్రేయస్సు వైపా, ఓటు బ్యాంకుల వైపా?

రేపిస్టు బాబా కోసం ఆయుధాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించే వారిని సంఘ వ్యతిరేక శక్తులు అనక మరేమంటాం! అనటం తప్పు కాదు. వారు చేసిన పనులు అలాంటివి. మరి వారు అలా తయారుకావడానికి కారకులైన వారిని ఏమందాం? భారతదేశాన్ని కులం, మతం పేరుతో చీలికలు పేలికలు చేసి, వ్యత్యాసాలను, అంతరాలను పెంచి పోషిస్తున్న వారిని ఏమందాం? వారిని ఏమనకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక తాత్కాలిక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి అలాగే కాలం వెళ్లబుచ్చుదామా? హర్యానాలో డేరాల వంటి శాఖలకు అంతగా జనాదరణ ఉండడానికి కులవ్యవస్థ కారణం. తమ ప్రమేయం లేని తమ పుట్టుక కారణంగా తమను అంటరాని వారిగానో, పనికిరాని వారిగానో చూస్తున్న సమాజంపై నిమ్న కులాలకు ఉండే కడుపు మంటను అర్ధం చేసుకోవాలంటే వారి బాధను అనుభవించాలి. కాప్ పంచయితీల ముందు ఒక్కసారి నుంచుంటే తెలుస్తుంది. గుర్మీత్ అనుచరులు అలాంటి వారే.

రామ్ రహీమ్ సింగ్‌ను సమర్థిస్తున్న బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్
హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌

ఆధునిక యుగంలో, టెక్నాలజీ పురోగతి అంచనాలకు కూడా అందని స్థితిలో కూడా ఇండియాలో నెలకోని ఉన్న అసమానతలు, కుల వివిక్ష వైపరీత్యాలు డేరాల లాంటి శాఖలకు మంచి పంటపొలాలు. గుర్మీత్ లాంటి బాబాల ఉద్దేశాలు ముందు మంచివయినా వారు భౌతికంగా, మనసికంగా అవినీతిపరులు అవడానికి ఎక్కువ కాలం పట్టదు. తమ చుట్టూ చేరిన వారిలో కొందరిని కరడుగట్టిన నేరస్తులుగా మార్చడం కూడా తేలికే. గుడ్డిగా, మూఢంగా ఆరాధించే అనుచరులు పెద్ద సంఖ్యలో చుట్టూ ఉన్నపుడు నాయకత్వం దిగజారడం తధ్యం.

డేరా సచ్చా సౌదా వంటి శాఖలు చట్ట పాలనకు అతీతమనీ, తేడా వస్తే తీవ్రమైన అల్లకల్లోలాలకు దారి తీస్తాయనీ పాలకులకు తెలుసు. కానీ అవి ఢోకా లేని ఓటు బ్యాంకులని కూడా తెలుసు. బాబా ఒక్క మాట చెబితే చాలు, లక్షలాది అనుచరగణం ఓట్లు గంపగుత్తగా పడతాయి. ఈ వైరుధ్యాన్ని రాజకీయులు ఎలా పరిష్కరించాలి? ఎటు మొగ్గాలి? సమాజ శ్రేయస్సు వైపా, ఓటు బ్యాంకుల వైపా?

ఇక్కడ, చర్చిల్ మాటలకు అతీతంగా తమను తాము నిరూపించుకున్న రాజకీయపార్టీ మనకు ఒక్కటీ కనబడదు. నడిపించినంత కాలం కాంగ్రెస్ నడిపించింది. రేపు అవకాశం వస్తే మళ్లీ నడిపిస్తుంది. కాలం కలిసివచ్చింది కాబట్టి ఇప్పుడు బిజెపి నడిపిస్తున్నది. డేరాల వంటి శాఖల పుట్టుకకు దారి తీసిన సామాజిక చట్రంతో బిజెపికి పేచీ ఏమీ లేదు. నిజానికి ఆ చట్రం తాత్విక పునాదుల మీదే బిజెపి నడుస్తున్నది. అయితే ఆ తాత్వికత తెచ్చిపెట్టిన అరిష్టాలను రాజకీయ ప్రయోజనాల కోసం పెంచి పోషించడంతో కూడా బిజిపికి పేచీ లేదు.

హర్యానాలో జరిగింది అదే. 2014లో బిజెపి అధికారంలోకి రావడానికి గుర్మీత్ మద్దతు పనికి వచ్చింది. బిజెపి అధికారంలోకి వచ్చింది కాబట్టి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి అయ్యారు. మరి రుణం తీర్చుకోవద్దూ. ఇంత జరిగినా కత్తర్‌పై వేటు వేసేందుకు బిజెపి నాయకత్వం సిద్ధంగా లేదు చూడండి. శిష్యురాళ్లను మానభంగం చేశాడన్న కారణంగా గుర్మీత్ జైలుకు వెళ్లినా డేరా ఎక్కడికీ పోదు. గుర్మీత్ బదులు మరొకరు వస్తారు. మళ్లీ ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తాయి. హింసాకాండను ప్రధాని మోదీ ఖండించారు. అయితే ఆయన మాటల్లో హర్యానా ప్రస్తావన గానీ, డేరా సచ్చా సౌదా ప్రస్తావన గానీ లేదు. గమనించారా!?

                                                                                         – ఆలపాటి సురేశ్ కుమార్