‘ఉంగరాల రాంబాబు’ మూవీ రివ్యూ

15 September, 2017 - 11:00 AM


సినిమా : ఉంగరాల రాంబాబు
నటీనటులు : సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, తాగుబోతు రమేష్, హరితేజ తదితరులు
దర్శకుడు : క్రాంతి మాధవ్. కె
నిర్మాత : పరుచూరి కిరీటి
సినిమాటోగ్రఫి : సర్వేష్ మురారి
సంగీతం : గిబ్రాన్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేది : సెప్టెంబర్ 15, 2017.

‘మర్యాద రామన్న’, పూలరంగడు వంటి చిత్రాల తర్వాత సరైన హిట్టుకోసం ఎదురుచూస్తున్న సునీల్ మరోసారి తన అదృష్టాన్ని ‘ఉంగరాల రాంబాబు’తో పరీక్షించుకోబోతున్నాడు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి క్లాసిక్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు కె. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సునీల్, మియాజార్జ్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఎ యునైటెడ్ మూవీస్ బ్యానర్‌పై పరుచూరి కిరీటీ నిర్మించిన ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ విలువలతో కూడిన కామెడీ, ఫ్యామిలీ యాక్షన్ మేసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా ‘ఉంగరాల రాంబాబు’ రూపొందినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో… సునీల్‌కు ఎలాంటి విజయాన్ని అందించనుందో చూద్దామా!

కథ :
చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తాత దగ్గరే పెరుగుతాడు రాంబాబు(సునీల్). 200కోట్ల ఆస్తి ఉన్న రాంబాబు తాత చనిపోవడంతో ఆస్తి పోయి అనాధ అవుతాడు. బాదం బాబా(పోసాని)ను కలవడం వల్ల సునీల్ కి 200కోట్ల ఆస్తి కలిసొస్తుంది. దీంతో ఓ ట్రావెల్స్ ను ప్రారంభిస్తాడు. ఈ ట్రావెల్ బస్ లో ప్రయాణించి తన ఉద్యోగం పోగొట్టుకున్నానని సావిత్రి(మియా) కోపంతో రాంబాబు వద్దకి వస్తుంది. దీంతో సావిత్రికి తన ఆఫీసులోనే మేనేజర్ గా జాబ్ ఇస్తాడు రాంబాబు. ఆ తరువాత సావిత్రితో ప్రేమలో పడతాడు. సీన్ కట్ చేస్తే… కొచ్చిలోని చేగునే పుగొండి వనం అనే గ్రామంలో విప్లవ భావాలు కలిగిన వ్యక్తి కామ్రేడ్ రంగ నాయర్ (ప్రకాష్ రాజ్). ఊరిలో ఎవరికైనా అన్యాయం జరుగుతుందని తెలిస్తే పోరాటంలో ముందుండి నడిచే నాయకుడు అతను. ఇక రాంబాబు-సావిత్రి లు తమ ప్రేమ విషయాన్ని చెప్పి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి సావిత్రి ఇంటికి వెళ్తారు. అయితే అక్కడి ఊరి సమస్యలు ప్రకాష్ రాజ్ ఫ్యామిలీకి కొన్ని ఇబ్బందులను కలుగజేస్తాయి. ఈ విషయం గమనించిన రాంబాబు స్వయంగా ఆ సమస్యలను పరిష్కరించేందుకు రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ప్రకాష్‌రాజ్ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలేంటీ? సునీల్ ఎందుకు వాటిని ఎదుర్కోవాల్సి వచ్చింది? మరి వాటన్నింటిని రాంబాబు ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు సావిత్రి-రాంబాబుల పెళ్లికి ప్రకాష్‌రాజ్ ఒప్పుకున్నాడా లేదా? అనే ఆసక్తికరమైన అంశాలను వెండితెరమీద చూసి ఎంజాయ్ చేయాల్సిందే!

నటీనటుల పనితీరు :
‘ఉంగరాల రాంబాబు’ సినిమాలో నటించిన నటీనటుల విషయానికొస్తే.. ఇద్దరు నటులు సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. ఒకరు హీరో సునీల్ కాగా.. మరొకరు ప్రకాష్ రాజ్. సునీల్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. కామెడీ, డాన్స్, యాక్షన్ సీన్లలో దుమ్మురేపేసాడు. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్‌ సీన్స్ బాగా చేసాడు. ఇక ఊరి పెద్దగా, ఒక విప్లవ భావాలు కలిగిన వ్యక్తిగా ప్రకాష్ రాజ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. చాలా సెటిల్డ్‌గా కనబడుతూనే పోరాట స్పూర్థిని రెకేత్తించగల వ్యక్తిగా కనిపించాడు. ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. సునీల్-ప్రకాష్‌రాజ్‌ల మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. ఇక హీరోయిన్ మియా జార్జ్ పర్వాలేదనిపించింది. సాంగ్స్‌లలో బాగానే గ్లామర్ ఒలకబోసింది. సునీల్-మియాల కెమిస్ట్రీ బాగుంది. ఇక వెన్నెల కిషోర్, పోసానీ కృష్ణమురళి, తాగుబోతు రమేష్‌ల కామెడీ బాగుంది. అలాగే హరితేజ, రాజీవ్ కనకాల, చలపతిరావులు బాగా చేసారు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

ఇక సినిమా విషయానికొస్తే…. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమించడం… ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి.. పెద్దలను ఒప్పించడానికి వాళ్ల ఇంటికి వెళ్లడం.. అమ్మాయి వాళ్ల ఫ్యామిలీకి దగ్గరవడం.. వారికి ఏమైనా సమస్యలు వస్తే వాటిని ఎదుర్కొని పోరాడటం.. చివరకు ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల మనసులు గెలుచుకొని ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవడం… ఇలాంటి కాన్సెప్టుతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కానీ ‘ఉంగరాల రాంబాబు’ కథ విషయంలో అలాగే అనిపించినా.. కథనం పరంగా ఎంటర్‌టైనింగ్ విధంగా చెప్పాలని దర్శకుడు ప్రయత్నించాడు. ఫస్ట్‌హాఫ్‌ అంతా బోరింగ్ సెకండాఫ్ రొటీన్ ఎంటర్ టైన్మెంట్ తో కొనసాగుతూ వుంటుంది. ఇక ఎప్పుడైతే హీరోయిన్‌ ఇంటికి సునీల్ ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుంచి ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎమోషనల్‌గా కూడా స్టోరీ కొనసాగుతోంది. ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఓ మంచి మెసేజ్‌ను తెలియజేసే చిత్రమిది.

మన హక్కుల కోసం మనం పోరాటం చేద్దాం అనే రంగ నాయర్ పాత్రలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ బాగుంది. క్రమశిక్షణ, సహణం, మంచితనం, సేవాగుణం వంటి అంశాలు కలిగిన వ్యక్తిగా ప్రకాష్ రాజ్ నటన బాగుంది. రాంబాబు తన ప్రేమకోసం మొదలుపెట్టిన ప్రయాణంలో ఎన్నో విషయాలను తెలుసుకుంటాడు. అయితే ఈ సినిమాలో కామెడీ బాగున్నప్పటికీ.. చాలా మేరకు రొటీన్ కామెడీయే అనిపించే విధంగా వుంది. సినిమాలో పాటలు బిగ్గెస్ట్ మైనస్. కొన్ని కొన్ని చోట్ల తప్ప బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతంత మాత్రంగానే అనిపిస్తోంది. ఓవరాల్‌గా చూసుకుంటే ‘ఉంగరాల రాంబాబు’ సినిమా కాసేపు చూసి నవ్వుకోవడమే కాకుండా మన సమాజానికి ఒక మెసేజ్‌ను అందించే ఎంటర్‌టైనింగ్ చిత్రమని చెప్పుకోవచ్చు.

సాంకేతికవర్గం పనితీరు:
ఈ సినిమాకు సర్వేష్ మురారి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ముఖ్యంగా పల్లెటూరి అందాలను బాగా చూపించారు. ఇక గిబ్రాన్ సంగీతం అందించిన పాటలు అస్సలు బాగోలేవు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు కె. క్రాంతిమాధవ్ పాత కథకే కొత్త కథనంతో చూపించాలనే ప్రయత్నం చేసాడు. కానీ దర్శకుడిగా క్రాంతి మాధవ్ విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. నిర్మాత పరుచూరి కిరీటీ సినిమాను చాలా బాగా రూపొందించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను గ్రాండ్‌గా తీర్చిదిద్దారు.

చివరగా:
ఉంగరాల రాంబాబు
: రొటీన్ బోరింగ్ ఎంటర్ టైనర్.