క్లెయిమ్ కాని బ్యాంకు డిపాజిట్లు ఎన్ని వేల కోట్లో!

13 January, 2018 - 5:32 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: దేశంలో క్లెయిమ్‌‌ కాని బ్యాంకు డిపాజిట్లు రూ.8 వేల కోట్లకు చేరుకున్నాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఆయా బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన వ్యక్తులు లేదా వారసుల వివరాలు బ్యాంకు అధికారుల దగ్గర లేవు. అయితే.. బ్యాంకు ఖాతాదారుల డిపాజిట్లు మాత్రం రూ.8 వేల కోట్లకు చేరినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన తాజా నివేదికను ఆర్‌‌బీఐ విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా మొత్తం 2.63 కోట్ల బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన వివరాలు అధికారుల దగ్గర లేవు. కానీ వారి డిపాజిట్లు మాత్రం రూ.8,864.6 కోట్లు ఉన్నాయి. 2012 నుంచి 2016 వరకు ఈ అప్రకటిత బ్యాంకు డిపాజిట్లలోని నగదు రెట్టింపు అయింది. బ్యాంకుల్లో ఏళ్ల తరబడి డిపాజిట్లు చేసి.. వాటిని తీసుకోవడానికి ఎవరూ రాకపోవడం లేదా.. ఆ డిపాజిట్‌‌దారుల పూర్తి సమాచారం లేకపోవడంతో అవి అన్‌‌క్లెయిమ్‌‌డ్‌ డిపాజిట్లుగా మారిపోతాయి.అప్రకటిత బ్యాంకు ఖాతాల సంఖ్య కూడా 2012లో 1.32 కోట్లు ఉండగా.. 2016 నాటికి అది రెట్టింపై 2.63 కోట్లకు చేరింది. అదే సమయంలో వారి డిపాజిట్లు కూడా రూ.3,598 కోట్ల నుంచి రూ.8,864.6 కోట్లకు చేరాయి. క్లెయిమ్‌ చేయని బ్యాంకు డిపాజిట్‌‌దారుల వివరాలను బ్యాంకు అధికారులు తమ అధికారిక వెబ్‌‌సైట్లలో ఉంచాలని ఆర్‌‌బీఐ సూచించింది. ఈ జాబితాలో తప్పకుండా ఆ డిపాజిట్‌ చేసిన ఖాతాదారుని పూర్తి పేరు, వివరాలు పొందుపరచాలంటూ ఆర్‌‌బీఐ సలహా ఇచ్చింది. అలా చేయడం వల్ల వారి వారసుల వివరాలు తెలుసుకోవడం సులభం అవుతుందని ఆర్‌‌బీఐ పేర్కొంది.

క్లెయిమ్‌ చేయని బ్యాంకు డిపాజిట్లు అత్యధికంగా ఉన్న బ్యాంకు జాబితాలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రథమ స్థానంలో నిలిచింది. సుమారు 47 లక్షల ఇన్‌‌యాక్టివ్‌ ఖాతాల్లో మొత్తం రూ.1,036 కోట్ల నగదు ఉంది. 47 లక్షల ఇన్‌‌యాక్టివ్‌ బ్యాంకు ఖాతాల్లో రూ.995 కోట్ల నగదు ఉండి కెనరా బ్యాంకు తర్వాతి స్థానంలో ఉంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌‌లో 23 లక్షల ఇన్‌‌యాక్టివ్‌ ఖాతాలుండగా.. అందులో రూ.829 కోట్లు మూలుగుతున్నాయి. మరోవైపు ఈ డిపాజిట్లపై బ్యాంకు ఇచ్చే వడ్డీతో ఆ నగదు మరింత పెరుగుతోంది.