కనబడని గోడలు కడుతున్నారు

25 February, 2018 - 4:16 PM

హతుడు ఫలానా మతానికి చెందినవాడన్న కారణంగా ఆ హత్యను సమర్థించవచ్చా? పూణేలో దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన ఒక హత్య కేసులో నిందితులకు బెయిలు మంజూరు చేయడానికి బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి చూపిన కారణం అదే. ఆ బెయిలును మొన్న రద్దు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఆ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించింది.

2014 జూన్‌ రెండవ తేదీ రాత్రి పూణేలో 23 మంది యువకులు తమకు దారిలో తారసపడిన షేక్‌ మొహసిన్‌ అనే 24 ఏళ్ల ఐటి ఉద్యోగిని హాకీ బ్యాట్లతో కొట్టి చంపారు. ఆ యువకులు హిందూ రాష్ట్ర సేన అనే ఓ సంస్థ సమావేశంలో పాల్గొని తిరిగి వెళుతున్నారు. షేక్‌ మొహసిన్‌ మసీదులో ప్రార్థన ముగించుకుని ఇంటికి వెళుతున్నాడు. అతని వంటి మీద ఆకుపచ్చ చొక్కా ఉంది. ముఖానికి గడ్డం ఉంది. చూడగానే ముస్లిం అని తెలిసిపోతున్నది. ఎదురొచ్చిన హిందూ యువకులకు మొహసిన్‌తో పరిచయం కూడా లేదు. ముస్లిం కాబట్టి మూకుమ్మడిగా దాడి చేసి ఓ నిస్సహాయుడిని, నిరాయుధుడిని కొట్టి చంపారు.వారికి బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తికి ఆ అంశమే బెయిల్ ఇవ్వడానికి తగిన కారణంగా కనిపించింది. ‘హతుడికీ నిందితులకీ మధ్య వ్యక్తిగత వైరం లేదు. హతుడు ముస్లిం కాబట్టి మతపరమైన విద్వేషంతో నిందితులు అతడిని హతమార్చారు. ఈ హత్యకు ఇతరత్రా కారణం ఏమీ లేదు. హతుడి తప్పల్లా అతను వేరే మతానికి చెందిన వాడు కావడమే’ ఇలా సాగింది బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి వాదన.

అంతకు ముందు నిందితులకు బెయిల్‌ నిరాకరించిన పూణే సెషన్స్ కోర్టు అందుకు ఇదే కారణం చూపింది. ‘ముస్లిం లాగా కనబడినంతమాత్రాన ఎలాంటి వైరం లేకుండా చంపేస్తారా? ఇంత ఘోరమైన నేరం చేసిన వారికి బెయిల్ ఎలా ఇస్తాం?’ అని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. బెయిల్‌ రద్దు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఇదే ప్రశ్న వేసింది.మత విద్వేషాలను పెంచి పోషించేందుకు హిందుత్వశక్తులు శతవిధాలా ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉంది. ఇటీవల జమ్మూ ప్రాంతంలోని సుంజువాన్‌ సైనిక శిబిరంపై టెర్రరిస్టులు జరిపిన దాడి అనంతరం సైనిక జవాన్ల మతం చర్చలోకి వచ్చింది. టెర్రరిస్టులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన జవాన్లలో ముగ్గురు కాశ్మీరీ ముస్లింలేనని మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్య ఈ చర్చకు దారి తీసింది.‘ఇండియాలో ముస్లింలను కొందరు పాకిస్థానీలని అంటున్నారు. టెర్రరిస్టులు ఇక్కడ ముస్లింలను కూడా చంపుతున్నారు’ అని ఒవైసీ అన్నారు. ఇందుకు సమాధానంగా ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు శ్రీనగర్‌‌లో మాట్లాడుతూ.. ‘మేము సైనికులను మతపరంగా చూడం. భారత ఆర్మీ సర్వమతాల కూడలి’ అన్నారు. ఆ అధికారి అన్నది నిజమే. అందులో సందేహం లేదు. 2002లో గుజరాత్‌‌లో గోధ్రా అనంతరం ముస్లిం ఊచకోత సైనిక బలగాలు రంగప్రవేశం చేసిన తర్వాత మాత్రమే ఆగింది.

సైనిక జవాన్లను మతపరంగా చూడాల్సిన అవసరం లేదు కానీ, అసదుద్దీన్‌ ఒవైసీ ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చిందో చూడక తప్పదు.

భారత ముస్లింల పట్ల నిర్హేతుకమైన ద్వేషాన్ని హిందువులలో నూరిపోసేందుకు హిందుత్వ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ విద్వేష ప్రచారానికి అందివచ్చిన ప్రతి సందర్భాన్నీ వినియోగించుకుంటున్నాయి. సోషల్‌ మీడియా ద్వారా అసత్యాలనూ, అర్ధసత్యాలనూ ప్రచారంలో పెడుతున్నాయి. అక్కడక్కడా జరిగే ఒకటి రెండు అవాంఛనీయ సంఘటనలను అందిపుచ్చుకుని, గోరంతలు కొండంతలుగా చిత్రీకరించి భారత ముస్లింల దేశభక్తినీ, విధేయతనూ ప్రశ్నిస్తున్నాయి. భారత సమాజాన్ని మత ప్రాతిపదికన నిట్టనిలువునా చీల్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ‘కౌబెల్ట్‌’గా పిలిచే ఉత్తరాది రాష్ర్టాలలో ఈ ధోరణి మరీ ఎక్కువగా విజృంభిస్తోంది. 2014 ఎన్నికలలో బిజెపిని సొంత మెజారిటీతో అధికారంలోకి తీసుకు రావడానికి తోడ్పడిన అంశాలలో ఈ ‘చీలిక’ కూడా ఒకటి.

మళ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మతపరమైన చీలికను మరింత లోతుగా విస్తరించేందుకు హిందూత్వ శక్తులు నిరంతరం పావులు కదుపుతున్నాయి. తమ ఎజెండాను అమలు పరచగల భారతీయ జనతా పార్టీని ఈ సారి కూడా అధికారంలోకి తీసుకు రావాలంటే దక్షిణాది రాష్ర్టాలలో కూడా సమాజాన్ని మత ప్రాతిపదికపై చీల్చాల్సిన అవసరం ఉందని ఆ శక్తులు భావిస్తున్నాయి. ఆ దిశగా ఇక్కడ కూడా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కేరళ, కర్ణాటక రాష్ర్టాలలో ఇటీవలి పరిణామాలను ఈ కోణం నుంచే చూడాలి.

నిజానికి భారత సమాజంలో ఈ చీలిక ఎంతో కొంత ముందు నుంచే ఉంది. 1992 నాటి బాబ్రీ మసీదు విధ్వంసం ఫలితంగా, తదనంతరం చోటు చేసుకున్న అనేక పరిణామాల ఫలితంగా ఈ చీలిక ఉండేకొద్దీ ప్రస్ఫుటమవుతూ వచ్చింది. ముంబై మహా నగరంలోని కొన్ని ప్రాంతాలలో ముస్లింలకు ఇల్లు అద్దెకు ఇవ్వకపోవడం చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఢిల్లీ, నోయిడా, గురుగావ్‌ లాంటి నగరాలకు కూడా ఈ వివక్ష పాకింది. గుజరాత్‌‌లో హిందువులు నడిపే వ్యాపారాలలో, పరిశ్రమలలో ముస్లింలకు ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది వాస్తవ పరిస్థితి. ఈ వాస్తవాన్ని మనం అంగీకరించకపోవడం దానిని ఉపేక్షించడం కన్నా ప్రమాదకరం.

వ్యక్తిగతమైన మంచి చెడ్డల ఆధారంగా కాకుండా మతం ప్రాతిపదికన మనిషిని తూకం వేసే ఈ విషాదాన్ని మరింత లోతుగా, మరింత గాఢంగా దేశవ్యాపితం చేసేందుకు సంఘ్‌ పరివార్‌ నాయకత్వంలోని హిందుత్వ శక్తులు కంకణం కట్టుకున్నాయి. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రయత్నాలకు గట్టి ఊతం లభించింది. అడ్డూ ఆపూ లేని గో సంరక్షక దళాల అరాచకాలూ, లవ్‌ జిహాద్‌ బూచి పేరిట సాగుతున్న ప్రచారం అసలు లక్ష్యం ఇదే. సంకుచిత జాతీయ వాదాన్ని దేశభక్తిగా చిత్రించే యత్నాలు ముమ్మరం అయ్యాయి. వందేమాతర గీతం, సూర్య నమస్కారాల వంటి యోగాసనాల వివాదాలు అందుకే పుంజుకుంటున్నాయి. అధికార పీఠాలలో ఉన్నవారు కూడా నిస్సంకోచంగా ఈ అగ్నిలో ఆజ్యం పోస్తున్నారు.

చట్టాలను చేసే అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థ మన పార్లమెంటు. బిజెపి తరపున ప్రజాప్రతినిధిగా అందులో అడుగుపెట్టిన వినయ్‌ కత్యార్‌ అనే పెద్దమనిషి ఇటీవల, భారత దేశంలోని ముస్లింలందరూ పాకిస్తాన్‌ వెళ్లిపోవాలని అన్నారు. ‘భారత దేశాన్ని 1947లో మత ప్రాతిపదికన విభజించింది ముస్లింలే. వారికి ఇక్కడేం పని? అందరూ పాకిస్తాన్‌ వెళ్లిపోవాల్సిందే’ అన్నారాయన. ఒక లోక్‌‌సభ సభ్యుడు ఇంత తీవ్రమైన ప్రకటన చేస్తే బిజెపి నాయకత్వం అదేమిటని అనలేదు. వినయ్‌ కత్యార్‌ ఎప్పడూ అలాగే వివాదాస్పద ప్రకటనలు చేస్తాడులే అని మనమూ సరిపెట్టుకుంటున్నాం. కానీ ఆ ప్రకటన ఎంతమంది మనసులను విషపూరితం చేస్తుందో ఆలోచించడం లేదు.

నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి గత ఏడాది ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో చేసిన ప్రకటన ముందు ఇవన్నీ దిగదుడుపే. ఆ ఎన్నికలలో 403 సీట్ల అసెంబ్లీలో 384 స్థానాలకు బిజెపి అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ముస్లిం అభ్యర్థి లేరు. జనాభాలో 20 శాతం వరకూ ముస్లింలున్న రాష్ట్రంలో అధికారం చేపట్టే లక్ష్యంతో ఎన్నికల గోదాలోకి దిగిన బిజెపి తమకు ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా అక్కర్లేదని నిర్ణయించుకుంది. ముస్లింలకు వ్యతిరేకంగా నేరుగా ఒక్కమాట కూడా మాట్లాడకుండా బిజెపి చేసిన అతిపెద్ద రాజకీయ ప్రకటన ఇది.

ఇంకా అనుమానాలకు ఆస్కారం ఉందా? హిందుత్వ శక్తులు, భారతీయ జనతా పార్టీ కలిసి భారత సమాజం గతిని ఎలా మార్చాలనుకుంటున్నదీ స్పష్టంగా అర్థం కావడం లేదా? ఇలాంటి వాతావరణంలో ముస్లిం ఎవరైనా తన దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని భావించినట్లయితే అతనిని ఎలా తప్పుపట్టగలం? విషాదం ఏమిటంటే హిందుత్వ శక్తులు కడుతున్న ఈ కనబడని గోడలు అంతకంతకూ ఎంతో కొంత విస్తరిస్తున్నాయి. రేపు బిజెపి ఓడిపోయి మరో పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ గోడలు అలాగే ఉంటాయి. వాటిని పగలగొట్టడం అంత తేలిక కాదు.

– ఆలపాటి సురేశ్‌‌కుమార్‌
సీనియర్‌ జర్నలిస్టు

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో..)