సినిమాలుగా తీస్తే హిట్టే, కానీ…

09 February, 2018 - 7:26 PM

ఉన్నత స్థాయి న్యాయవ్యవస్థను భూతద్దం కింద నిలబెట్టే పరిణామాలు ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎన్‌. శుక్లాను అభిశంసన ద్వారా పదవి నుంచి తొలగించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా శ్రీకారం చుట్టారు.

లక్నోలోని ఒక మెడికల్‌ కాలేజీ 2017-18 సంవత్సరానికి గాను అడ్మిషన్లు మొదలుపెట్టేందుకు వీలుగా ముడుపులు తీసుకుని ఉత్తర్వులు ఇచ్చారన్నది జస్టిస్‌ శుక్లాపై వచ్చిన అభియోగం. దీనిపై మొదట ఒక నాన్‌ జుడిషియల్‌ కమిటీ విచారణ జరిపింది. తర్వాత ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, మరో హైకోర్టు న్యాయమూర్తితో కూడిన కమిటీ విచారణ జరిపి జస్టిస్‌ శుక్లాపై వచ్చిన అభియోగాలు వాస్తవాలేనని తేల్చింది.

అయితే ఇందులో ఇంకా చాలా లోతు ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా కేంద్రంగా చాలా పెద్ద వివాదమే సుళ్లు తిరుగుతోంది. లక్నోలోని మరో మెడికల్‌ కాలేజీని నడిపే ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు అనే సంస్థకు అనుకూలంగా గత సంవత్సరం జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బెంచ్‌ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు సుప్రీంకోర్టులో 2017 ఆగస్టు 24వ తేదీన దాఖలు చేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకునేందుకు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బెంచ్‌ అనుమతించినందువల్లనే ఆ సంస్థ అలహాబాద్‌ హైకోర్టులో తమకు అనుకూలమైన ఉత్తర్వులు తెచ్చుకోగలిగింది. ఆ ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు బెంచ్‌కు నేతృత్వం వహించింది ఇప్పుడు అభిశంసన ఎదుర్కొంటున్న జస్టిస్‌ శుక్లానే.

ఈ కేసు దర్యాప్తు చేసిన కేంద్ర నేర పరిశోధక సంస్థ (సీబీఐ) 2017 సెప్టెంబర్‌లోనే ఒక ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకూ అరెస్టు చేసిన వారిలో ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఐ.ఎం. ఖుద్దుసి కూడా ఉన్నారు.

మీడియా కథనాల ప్రకారం, ఈ కేసులో జస్టిస్‌ శుక్లాపై ఎఫ్ఐఆర్‌ దాఖలు చేసేందుకు అప్పట్లోనే సీబీఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అనుమతి కోరింది. అయితే ఆయన అందుకు నిరాకరించారు. తర్వాత మరో మెడికల్‌ కాలేజీకి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిన కేసులో జస్టిస్‌ శుక్లాపై జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అంతర్గత విచారణ ప్రారంభించారు. ఆ విచారణ ఇప్పుడు అభిశంసన దశకు చేరింది.

ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు కేసులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రమేయం లేకుండా సుప్రీంకోర్టు విచారణ కోరుతూ ‘క్యాంపెయిన్‌ ఫర్‌ జుడిషియల్‌ ఎక్కౌంటబిలిటీ అండ్‌ రిఫార్మ్స్‌’ (సి.జె.ఎ.ఆర్.) అనే స్వచ్ఛంద సంస్థ తరపున పిటిషన్‌ దాఖలు చేసిన సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, ఒక త్రిసభ్య ధర్మాసనం నుంచి తీవ్రమైన మందలింపును ఎదుర్కోవాల్సి వచ్చింది. బెంచ్ నుంచి కోర్టు ధిక్కరణ అభియోగాన్ని అభియోగాన్ని ఆయన కొద్దిలో తప్పించుకున్నారు. 25 లక్షల రూపాయల జరిమానాతో ధర్మాసనం సరిపుచ్చింది.

అయితే ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్టు కేసులో మిగతా నిందితులకూ, మాజీ న్యాయమూర్తి ఖుద్దుసికి మధ్య అప్పట్లో జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులు ఇటీవల మీడియాకు లీకయ్యాయి. ఈ ఫోన్ సంభాషణల ఆధారంగా సిజెఎఆర్ మళ్లీ రంగంలోకి దిగింది. మెడికల్ కాలేజీల లంచాల స్కాంలో పెద్ద కుట్ర ఉందనీ, దానిపై విచారణ జరపాలనీ కోరుతూ ఒక పిటిషన్‌ను ఇటీవల మీడియా సమావేశంలో జస్టిస్ దీపక్ మిశ్రాపై ఆరోపణలు చేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులకు సమర్పించారు.

ఈ వ్యవహారంలో వాస్తవమెంతో, అవాస్తవమెంతో నిగ్గు తేలాల్సిందే. సీజరు భార్య సామెత చందాన న్యాయవ్యవస్థ ఏమాత్రం అనుమానానికి తావు లేని విధంగా వ్యవహరించాల్సిందే. అనుమానాలు ఉత్పన్నం అయితే వాటి అంతు తేల్చాల్సిందే. అయితే ఈ రాత ప్రధాన ఉద్దేశం న్యాయవ్యవస్థ మంచి చెడులు బేరీజు వేయడం  కాదు. ఈ మొత్తం వ్యవహారంలో మనకి ఇంకేమీ మకిలి కనబడడం లేదా? అత్యున్నతస్థాయి న్యాయవ్యవస్థకు ప్రలోభాలు ఎర వేస్తున్న వారి గురించి ఆలోచించనక్కరలేదా? నిజమే! న్యాయవ్యవస్థకు లంచాల ఎర చూపుతున్నది ఒక్క వైద్య కళాశాలల యాజమాన్యాలే కాదు. అధికారం, ధనార్జన ధ్యేయంగా పతనమవుతున్న నైతిక విలువల గురించి అంతగా పట్టించుకొనని భారత సమాజంలో నాలుగు వైపుల నుంచీ న్యాయవ్యవస్థకు ప్రలోభాలు ఎదురవుతున్నాయి.

అయితే వైద్య వ్యవస్థను మిగతా వాటి గాటన కట్టలేం. మానవ సమాజంలో వైద్య వృత్తి కన్నా గొప్పది, ఉదాత్తమైనదీ లేదు. ప్రాణరక్షణకు మించిన ఉదాత్తమైన పని ఏముంటుంది? అటువంటి వైద్యులను తయారుచేసే కళాశాలల పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి వ్యక్తులు వాటిని నడుపుతున్నారు? ఈ ప్రశ్నలు చాలా సందర్భాలలోనే మనకు ఎదురవుతున్నాయి. అయితే ఆయా సందర్భాలలో సమాజం పడాల్సినంతగా కలవరపడడం లేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి వెయ్యి మంది రోగులకు ఒక డాక్టరు ఉండడం  ఆదర్శవంతం. ఇండియాలో ఈ నిష్పత్తి రెండు వేల మందికి ఒక వైద్యునిగా ఉంది. 50 ఏళ్ల క్రితం ఈ నిష్పత్తి మరీ అథమ స్థాయిలో ఉండేది. వైద్యులను తయారు చేయడం కోసం ప్రభుత్వం ప్రయివేటు మెడికల్‌ కాలేజీలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. వైద్యులకు ఆరాధనా భావంతో కూడిన అత్యున్నత స్థాయి గౌరవం ఇచ్చే భారత సమాజంలో ఆ చదువుకు మొదటి నుంచీ మంచి గిరాకీ ఉంది. మరోపక్క మిషనరీ ఆసుప్రతుల సేవా తత్పరత వైపు నుంచి క్రమంగా ఫక్తు వ్యాపార ధోరణి గల కార్పొరేట్‌ వైద్యం వైపు ఈ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి.ఈ నేపథ్యంలో ప్రయివేటు వైద్య కళాశాలలు ఎక్కువ సంఖ్యలో మొదలయ్యాయి. ఇండియాలో విద్యతో వ్యాపారం చేయకూడదు. వ్యక్తులు విద్యా సంస్థలను నడపడానికి వీలు లేదు. అయితే, ట్రస్టుల పేరిట విద్యాసంస్థలు నడిపే వ్యక్తులు ఈ రంగంలోకి వచ్చేదే వ్యాపారం చేయడం కోసం. వ్యాపారం అన్నాక ఇక అందులో ఉచ్ఛ నీచాల ప్రస్తావన ఏముంటుంది? వైద్య కళాశాలల్లో అధ్యాపకులు ఉండరు. వైద్య విద్య బోధించే అధ్యాపకులు దేశంలో తగినంత మంది లేరు, అది వేరే సంగతి. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుప్రతులలో వైద్యులు ఉండరు సరికదా, అసలు రోగులే ఉండరు. భారతీయ వైద్య విద్యామండలి (ఎంసీఐ) బృందాలు ఏటా చేసే తనిఖీల సమయంలో కిరాయి రోగులు, కిరాయి అధ్యాపకులు, వైద్యులు ప్రత్యక్షం అవుతారు. ఎంసీఐ అధ్యక్షుడిగా వందల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము పోగేసి ఆఖరికి 2010లో అరెస్టయిన కేతన్‌ దేశాయ్‌ గుర్తున్నాడా?

అటు తగినంత మంది సిబ్బంది, ఇటు తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలు లేని ప్రయివేటు వైద్య కళాశాలలు ఎంసీఐ స్థాయిలో ముడుపులు ముట్టచెప్పి వేటు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాయి. (ఎమ్‌సిఐ స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది) అక్కడ కుదరని పక్షంలో ఏకంగా ఉన్నత న్యాయస్థానాలలోని జడ్జీలను లోబరచుకునేందుకు తెగబడతాయి.ఒక సంవత్సరం ఎడ్మిషన్లు ఆగితే ఒక ప్రయివేటు కళాశాల నష్టపోయే మొత్తం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది మరి. అందుకే కోట్లకు కోట్లు లంచాలు ఇచ్చేందుకు యాజమాన్యాలు ఏ మాత్రం వెనుకాడవు. ప్రయివేటు వైద్య కళాశాలలపై ఆదాయం పన్ను శాఖ దాడులు చేయడం, కోట్ల రూపాయల నల్లడబ్బును స్వాధీనం చేసుకోవడం ప్రతి ఏటా రివాజుగా మారింది. ఇదే అంశాన్ని కథా వస్తువుగా తీసుకుని కొద్ది సంవత్సరాల క్రితం రజనీకాంత్‌ హీరోగా నిర్మించిన సినిమా ‘శివాజీ’ ఘన విజయం సాధించింది. అంతకు ముందు ఘన విజయం సాధించిన మరో సినిమా ‘జెంటిల్మన్‌’ ఇతివృత్తం కూడా ఇదే.

సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక రుగ్మతను కథాంశంగా తీసుకుని సినిమా తీస్తే దానిని ఆదరిస్తున్నాం. ఆ రుగ్మతని మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యాలయాలను, అందునా వైద్య విద్యాలయాలను అడ్డమైన వ్యాపారాలు చేసేవాళ్లు, లిక్కర్‌ మాఫియా బాసులు, అధికారం కోసం అడ్డమైన దారులూ తొక్కే రాజకీయ నాయకులు, క్రిమినల్సూ నిర్వహించడంలో మనకేమీ దోషం కనబడడం లేదా?

కోట్ల రూపాయల డొనేషన్‌ చెల్లించి, తగిన సదుపాయాలు లేని ప్రయివేటు విద్యాలయాల్లో చదివి పట్టా పుచ్చుకునే వైద్యుడు ఎంత నాణ్యమైన విద్య సముపార్జిస్తాడు? ఎంత సేవా భావంతో వృత్తికి అంకితం అవుతాడు? పాలకుల వోటు రాజకీయాల పుణ్యమా అని ప్రభుత్వ రంగంలో వైద్య, ఆరోగ్య సదుపాయాలు కునారిల్లిపోతూ, కార్పొరేట్‌ వైద్య రంగం వర్థిల్లుతోంది. ధనార్జనే ఏకైక ధ్యేయంగా సేవా ధర్మాన్ని, వైద్య వృత్తి నియమాలనూ తుంగలో తొక్కి, కార్పొరేట్‌ ఆసుపత్రులు అత్యంత అమానవీయ పద్ధతులలో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. నైతికత అన్న మాటను దగ్గరకు రానీయని సమూహంగా వైద్యులు అవాంఛనీయమైన ఓ గుర్తింపును సంతరించుకుంటున్నారు.

ఒక సమాజం ఆరోగ్యవంతమైన రీతిలో అభివృద్ధి చెందాలంటే అందరికీ నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల స్థాయికి ఇండియాలో వైద్యుల సంఖ్య పెరగాలంటే ప్రయివేటు రంగంలో ఇంకా వైద్య కళాశాలలు వస్తాయి. అవి కూడా వ్యాపారమే చేస్తాయి. విద్య, ప్రత్యేకించి వైద్య విద్య, వ్యాపారం కాని రీతిలో నడిచే పకడ్బందీ వ్యవస్థను మనం నిర్మించుకోలేమా? విద్యా రంగం కూడా పూర్తిగా మాఫియా పద్దతుల్లోకి వెళ్లే ప్రమాదాన్ని నివారించాలంటే ఈ ప్రశ్నకు త్వరగా జవాబు వెతకడం మంచిది. సమాజ నిర్మాణం జరిగే విద్యాలయాల్లో ఇంత అవినీతిని ఉపేక్షించడం వేరుకుళ్ళును భరించడంతో సమానం .

– ఆలపాటి సురేష్‌కుమార్‌
(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)