వారంలో మూడు రోజులు సెలవు!

28 May, 2019 - 1:34 AM

(న్యూవేవ్స్ డెస్క్)

లండన్‌: వారంలో ఆరు రోజులు పని చేస్తే ఒక్క రోజు మాత్రమే ఉద్యోగులకు సెలవు దొరుకుతుంది. ఆ రోజు మొత్తం మిగతా ఇంటి పనులకే సరిపోతుంది. కుటుంబంతో సరదాగా గడిపే సమయం ఉద్యోగులకు ఇక ఎక్కడ ఉంటుంది? ఐటీ ఉద్యోగులకు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రమే వారానికి రెండు రోజుల సెలవు దొరుకుతుంది. మిగతా వారంతా ఆరు రోజులు పనిచేసి తీరాల్సిందే. అయితే.. ఈ విషయంలో బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ ఉద్యోగులు మాత్రం ఎంతో అదృష్టవంతులనే చెప్పుకోవాలి. సాధారణంగా నెలకు ఒక్క రోజు సెలవు కోసమే అనేక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కష్టపడుతుంటే.. ఇంగ్లండ్‌లోని ఓ కంపెనీ ఏకంగా వారానికి మూడు రోజులు సెలవు ఇచ్చేస్తుండడం విశేషం.

ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్‌లో ఉన్న పోర్ట్‌కలిస్ అనే న్యాయ సంస్థ ఈ కొత్త నిబంధనని తీసుకొచ్చింది. ఇక మీదట తమ ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు పనిచేస్తే చాలంటోంది. ఇలా వారానికి మూడు రోజులు సెలవు ఇచ్చినా ఉద్యోగుల జీతంలో ఎలాంటి కోతలూ ఉండబోవని స్పష్టం చేసింది. ఈ విషయం గురించి కంపెనీ డైరెక్టర్ ట్రేవర్ వర్త్ మాట్లాడుతూ.. ‘ఉద్యోగులకు నాలుగు రోజుల పనిదినాలు కల్పించడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. సిబ్బందిలో మరింత ఉత్సాహం కలుగుతుంది. అలసట కూడా తగ్గిపోతుంద’ని తెలిపారు. ప్రాథమిక ఫలితాల్ని పరిశీలిస్తే తమ ఉద్యోగులు గతంతో పోల్చితే చాలా ఆనందంగా ఉంటున్నారని, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నారని వెల్లడించారు.

పనిదినాల కుదింపు ఆరోగ్యకరమైన విధానమని, దీనివల్ల పనితీరు ఎంతో మెరుగవుతుందని, ఉద్యోగుల్లో ఒత్తిడి కనిపించడం లేదని ట్రేవర్ తెలిపారు. మరో న్యూజిలాండ్ కంపెనీ కూడా ఇలాంటి పద్ధతినే అనుసరించి 20 శాతం అదనంగా ఉత్పాదకత సాధించిందట. లాభాలు రావడమే కాకుండా, ఉద్యోగుల ఆరోగ్యం కూడా బాగా ఉంటోందట. దాంతో తాము కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నామని ట్రేవర్‌ తెలిపారు.