పెళ్ళాడిన పెళ్ళాలు..!

01 January, 2019 - 5:35 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లక్నో: ఆ యువతులిద్దరూ వేర్వేరు వ్యక్తుల భార్యలు. తమ వివాహ బంధంలో వారు ఇమడలేకపోయారు. తమ భర్తలకు విడాకులిచ్చేసి మరీ ఆ భార్యలిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఈ విస్తుపోయే సంఘటన ఉత్తరప్రదేశ్‌‌‌లోని బుందేల్‌‌ఖండ్‌‌లో జరిగింది. ఆరేళ్ల తర్వాత శనివారం ఓ ఆలయంలో స్నేహితులు, తమ న్యాయవాది ఎదుట వివాహ బంధంతో ఆ యువతులిద్దరూ ఒక్కటయ్యారు.

అయితే ఈ యువతుల వివాహాన్ని ధ్రువీకరించేందుకు రిజిస్ట్రార్‌ నిరాకరించారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ వారి వివాహాన్ని ఏ చట్టం కిందా గుర్తించలేమని ఆయన అన్నారు.

నిజానికి ఆ యువతులిద్దరూ అంతకు ముందు కళాశాలలో చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డారట! బుందేల్‌ఖండ్‌లోని హమీర్‌‌పూర్‌‌కు చెందిన ఇద్దరు యువతులు ఆరేళ్ల క్రితం కళాశాలలో తొలిసారిగా కలుసుకున్నారు. వారిద్దరూ తొలి పరిచయంలోనే ప్రేమలో పడ్డారు. యువతుల ప్రేమ గురించి వారి ఇళ్లలో తెలియడంతో అర్ధాంతరంగా చదువుకు స్వస్తిపలికించి మరీ ఇద్దరికీ వేర్వేరు యువకులతో పెళ్ళిళ్ళు చేయించారు.

కానీ.. ఆ యువతులు విడిపోయి ఆరేళ్లు గడిచినా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. తమ తమ భర్తల నుంచి వారు విడాకులు తీసుకుని వివాహం చేసుకున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ యువతుల వివాహాన్ని గుర్తించాలని కోరుతూ తాము న్యాయపోరాటం చేస్తామని వారి తరఫు న్యాయవాది తెలిపారు. భర్తల నుంచి తాము భరణం ఆశించడం లేదని, ప్రేమను నిలబెట్టుకునేందుకే ఒక్కటయ్యామని ఆ యువతులిద్దరూ చెబుతుండడం గమనార్హం.