లారీలు- బస్సు ఢీ: ఆరుగురు మృతి

13 June, 2018 - 4:30 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయనగరం: జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాద జరిగింది. కోల్‌‌కతా- చెన్నై జాతీయ రహదారిపై రెండు లారీలు, బస్సు ఢీ కొట్టుకున్నాయి. దీంతో టూరిస్టు బస్సు పూర్తిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కొద్ది గంటల్లో ఇంటికి చేరుకుంటారనగా అంతలోనే లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. రెండు లారీల ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న సమీప గ్రామస్థులు కేబిన్‌‌లో చిక్కుకున్న లారీ డ్రైవర్లను బయటకు లాగారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా పలువురు యాత్రికుల పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు.విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని కోడూరు గ్రామానికి చెందిన సుమారు అరవై మంది భక్తులు కాశీ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోడూరుకు మరో రెండు గంటల్లో చేరుకుంటారనగా ఈ దుర్ఘటన జరిగింది. బోల్తా పడిన బస్సులో 10 మంది లోపలే ఇరుక్కుపోయారు. ఘటనపై సమాచారం అందిన చాలా సేపటి వరకూ అంబులెన్స్‌ ప్రమాదస్థలికి చేరుకోలేదు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా జర్మనీలో ఉన్న ఆయన ప్రమాద ఘటనపై విజయనగరం జిల్లా ఎస్పీని ఫోనులో సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాల కోసం అదనపు పోలీసు బలగాలను ఘటనా స్ధలానికి తరలించాలని ఎస్పీని ఆదేశించారు.