ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలూ మిస్సింగ్!

16 May, 2018 - 11:55 AM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచి, మ్యాజిక్‌ ఫిగర్‌‌కు తొమ్మిది సీల్ల దూరంలో నిలిచిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా తన ఆపరేషన్‌ ముమ్మరం చేసింది. ఇటు కాంగ్రెస్‌, అటు జేడీఎస్‌ నుంచి ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించేందుకు బీజేపీ పెద్ద ఎత్తున యత్నాలు చేస్తోంది. ఇందుకు తగినట్టుగానే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుల సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొడితే.. ఇటు ప్రభుత్వానికి నేతృత్వం వహించాలనుకుంటున్న జేడీఎస్‌‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఝలక్‌ ఇచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో కుమారస్వామి సీఎంగా జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామిని జేడీఎస్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం బెంగళూరులోని ఓ హోటల్‌‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజా వెంకటప్ప నాయక, వెంకటరావు నాదగౌడ గైర్హాజరయ్యారు. వీరు రాకపోవడంపై జేడీఎస్‌ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ఆకర్షణకు లోనై ఈ ఎమ్మెల్యేలు జేడీఎస్‌ఎల్పీ భేటీకి దూరంగా ఉన్నారా? అనే చర్చ జేడీఎస్ పార్టీలో జరుగుతోంది.