వారెవ్వా…! ఏమి తెలివి బాసూ..!

14 May, 2018 - 3:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: పీకల దాకా మద్యం పుచ్చుకుని.. ఆపైన పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవాలనుకుంటున్నారా?.. అయితే.. హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో అత్యంత తెలివితేటలు ప్రదర్శించిన ఈ ఇద్దరమ్మాయిల జోష్ గురించి తెలుసుకోవాల్సిందే మరి.
అసలేం జరిగిందంటే… నల్ల టీషర్టు ధరించిన ఓ యువతి ఫుల్లుగా మద్యం సేవించింది. అంతకన్నా కాస్త తక్కువగా తీసుకున్న మరో స్నేహితురాలితో కలసి ఖరీదైన కారులో జూబ్లీహిల్స్‌లో ప్రయాణిస్తోంది. ఆ క్రమంలో దూరంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసింది. వెంటనే కారును రోడ్డు పక్కన ఆపి, ఇద్దరూ కిందకు దిగారు.

ఓ కారు రోడ్డు పక్కన ఆగిన విషయాన్ని చూసిన పోలీసులు బ్లాక్ టీషర్ట్ ధరించిన అమ్మాయి కారు నడిపిందని కూడా గమనించారు. ఆపై కారు దగ్గరకు వారు చేరుకునే లోపే పక్కనే ఉన్న ఏటీఎంలోకి ఇద్దరమ్మాయిలూ వెళ్లిపోయారు. వారి దుస్తులను పరస్పరం మార్చుకున్నారు. అక్కడి నుంచే తమ స్నేహితుడిని పిలిపించుకున్నారు. అతను వచ్చే సమయానికి నిమిషం ముందు ఆ ఇద్దరమ్మాయిలూ ఏటీఎం సెంటర్ నుంచి బయటకు వచ్చారు.

వారిని చూసిన పోలీసులు, కారును రోడ్డుపై ఎందుకు ఆపారని ప్రశ్నిస్తుండగానే, వారి స్నేహితుడు వచ్చి, కారు తనదని చెప్పాడు. అతనికి డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, బీఏసీ సున్నాగా చూపించింది. దీంతో చేసేదేమీ లేక రాంగ్ పార్కింగ్ కింద ఫైన్ విధించి పోలీసులు వెళ్లిపోయారు.

ఈ ఘటనపై ట్రాఫిక్ సీఐ కావేటి శ్రీనివాసులు స్పందిస్తూ.. కారు డ్రైవింగ్ సీటులో ఉన్నవారికి మాత్రమే డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష చేయాల్సి ఉంటుందని, తాము చూసిన సమయానికి కారు డ్రైవింగ్ సీటులో ఎవరూ కనిపించలేదని తెలిపారు. ఇక అక్కడే ఉన్న చాలా మంది ఏటీఎంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని చూస్తే, వారి నాటకం ఎలా రక్తి కట్టిందో తెలిసిపోతుందంటూ గుసగుసలాడారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడం కొసమెరుపు.