‘అమ్మ’ మెజార్టీకి దినకరన్ బ్రేక్!

24 December, 2017 - 7:26 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: ‘ఊరంతా ఒక దారైతే.. ఉలిపికట్టది మరో దారి’ చందంగా ఉంటుంది తమిళనాడు తీరు. దేశ రాజకీయాలతో పోలిస్తే తమిళ రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఎన్నికలు ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. గెలుస్తుందనుకున్న పార్టీ ఓడిపోతుంది. ఓడిపోతారనుకున్న వారు అనూహ్యంగా గెలుస్తారు. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు కూడా ఇక్కడ బలాదూరే! తమిళ రాజకీయాలంటే దేశం మొత్తానికి ఆసక్తే.

చెన్నైలోని ఆర్కేనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు కొద్ది రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి టీటీవి దినకరన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలకు షాకిస్తూ ఆయన 40,707 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు 50.32 శాతం ఓట్లు పోలయ్యాయి. 2016లో స్వతంత్ర అభ్యర్థిగా అమ్మ జయలలిత సాధించిన 39,545 ఓట్ల మెజార్టీని దినకరన్ అధిగమించారు. అప్పుడు జయలలిత సాధించిన మెజారిటీ కంటే 1,162 ఓట్లు అధికంగా దినకరన్ సాధించడం విశేషం.

కాగా.. ఈ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే డిపాజిట్ కోల్పోయింది. డీఎంకే సహా 57 మంది అభ్యర్థులు కూడా అలాగే డిపాజిట్లు కోల్పోయారు. నామ్ తమిళర్ కట్చికి 3,860, నోటాకు 2,373 ఓట్లు రాగా బీజేపీకి అత్యంత దారుణంగా కేవలం 1,417 ఓట్లు లభించాయి.

నిజానికి ఎక్కడైనా ఉప ఎన్నిక జరిగితే అధికార పార్టీ గెలవడం సర్వ సాధారణం. అందుకు అధికార బలం సహా అనేక లెక్కలు ఉంటాయి. అయితే.. తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికలో మాత్రం సీన్ రివర్స్ అవడం.. అధికార పార్టీ అభ్యర్థి కంటే స్వతంత్రంగా బరిలో దిగిన దినకరన్ భారీ మెజార్టీ సాధించడం గమనార్హం.