టీటీడీపీకి ‘యంగ్ టైగర్‌’ ‘సరైనోడు’!

28 February, 2018 - 7:47 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: విజభనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంత నష్టం జరిగిందో… తెలుగుదేశం పార్టీకీ అంతే నష్టం జరిగిందనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌‌లో భాగంగా పచ్చపార్టీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుని కారెక్కేశారు. దీంతో పచ్చ పార్టీలో లీడర్లు కరువయ్యారు. అంతేకాదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అలాగే పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరో అడుగు ముందుకు వేసి, సైకిల్ పార్టీని కారు పార్టీలో వీలినం చేస్తే మంచిదంటూ బహిరంగంగానే ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీని గట్టించేందుకు దమ్మున్న నాయకులే లేకుండాపోయారు. దీంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

అయితే.. తెలంగాణలో టీడీపీ కేడర్ చాలా బలంగానే ఉంది. పార్టీలో సరైన లీడర్లు లేకపోవడంతో పార్టీ కేడర్ ఆందోళనలో పడింది. ఇలాంటి పరిస్థితిలో పార్టీలోకి బలమైన నాయకుడు కావాలని.. అదీ కూడా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి రావాలని ఆశిస్తోంది.

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కుమారుడు, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఏపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కూడా ఏపీ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టి.. బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నటన పరంగా.. డైలాగ్ డెలివరీ పరంగా… అభిమానుల పరంగా తాతను మరిపించే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని వారంతా భావిస్తున్నారు. యంగ్ టైగర్ అయితేనే విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌‌లాగా పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తారని కేడర్ భావిస్తోంది.

గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా ఎన్టీఆర్ షూటింగ్ వద్ద ఉద్యమకారులు ఆందోళన చేపడితే… తాను తెలంగాణ వాడినే అని జూ.ఎన్టీఆర్ ప్రకటన చేశారని ఈ సందర్భంగా కేడర్ గుర్తుచేస్తోంది. తెలుగుదేశం పార్టీ భాగ్యనగరం నడిబొడ్డున పుట్టిందని ఈ సందర్భంగా ప్రస్తావిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్‌‌కు అత్యధికంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అదీకాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా… గులాబీ బాస్ కేసీఆర్‌‌కి… జూ.ఎన్టీఆర్ అయితేనే ‘సరైనోడు’ అని వారంతా భావిస్తున్నారు. జూ.ఎన్టీఆర్ సైకిల్ పగ్గాలు చేపడితే కేసీఆర్‌ను దీటుగా ఢీకొనగలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకుల భావన. అయితే.. ఈ ప్రతిపాదకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సానుకూలంగా స్పందిస్తారో.. లేదో అని పార్టీ కేడర్ మల్లగుల్లాలు పడుతోందని సమాచారం.