టీటీడీకి త్వరలో పాలకమండలి

14 January, 2018 - 5:21 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి త్వరలోనే నూతన పాలకమండలిని ఏర్పాటు చేస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఇతర మతాలపై విశ్వాసం ఉన్నవారిని టీటీడీలో నియమిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండించారు. హిందూ ధర్మం ప్రకారమే ఏ నిర్ణయమైనా తీసుకుంటామన్నారు. టీటీడీ పవిత్రతను కాపాడతాని సీఎం స్పష్టం చేశారు. ప్రజలందరికీ సిరి సంపదలు ఇవ్వాలని వెంకటేశ్వరస్వామి వారిని ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రార్థించినట్టు చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు వెంట నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఐటీ మంత్రి లోకేష్ తదితరులు ఉన్నారు.

అంతకు ముందు చంద్రబాబు నాయుడు చంద్రగిరిలోని హెరిటేజ్ ఫ్యాక్టరీని సందర్శించారు. సుమారు 21 ఏళ్ల తర్వాత ఆయన ఈ ఫ్యాక్టరీని సందర్శించడం గమనార్హం. ఇంధన పొదుపులో జాతీయ అవార్డు సాధనకు కృషి చేసిన సంస్థ ఉద్యోగులను చంద్రబాబు అభినందించారు. తన సతీమణి భువనేశ్వరి వల్లే హెరిటేజ్ ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, సామాజిక బాధ్యతతో కష్టపడి పనిచేస్తే అవార్డులు వస్తాయని అన్నారు.