టీటీడీ బోర్డు తొలి సమావేశం

23 September, 2019 - 3:58 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తిరుమల:  టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో సోమవారం బోర్డు సభ్యులతో తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రూ. 100 కోట్ల వ్యయంతో తిరుపతిలో హాస్టల్ నిర్మాణానికి…. అలాగే తిరుమలలో యాత్రికుల వసతి సముదాయం కోసం 5 అంతస్తుల నిర్మాణానికి… తిరుపతిలో గరుడ వారధి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే  అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి నిధుల కుదింపు ఆంశం, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాలకు, అలాగే శ్రీవారి ప్రసాదం ముడి సరకుల కొనుగోలు, సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చ జరిగింది.

అయితే సోమవారం తిరుమలలో గరుడాళ్వార్ సన్నిథిలో పాలక మండలి సభ్యుల చేత జేఈవో బసంత్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. శ్రీనివాస్, పార్థసారధి, రమణమూర్తి రాజు, మురళి కృష్ణ, జూపల్లి రామేశ్వరరావు, నాదెండ్ల సుబ్బారావు ఉన్నారు.

ఇటీవల టీటీడీ బోర్డులో సభ్యులను నియమిస్తూ వైయస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ నుంచి 8ని, తెలంగాణ నుంచి 7ని పాలకమండలిలో సభ్యులుగా సీఎం వైయస్ జగన్ నియమించారు. అలాగే కర్నాటక, తమిళనాడు,  మహారాష్ట్రకు చెందిన వారిని సైతం పాలక మండలి సభ్యులుగా నియమించిన విషయం విదితమే.