టీఎస్సార్టీసీలో ఉద్యోగాల భర్తీకి కసరత్తు?

10 October, 2019 - 4:43 AM

       (న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: టీఎస్సార్టీసీలో సమ్మె బాట పట్టిన కార్మికులకు షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ సర్కార్ పెద్ద ఎత్తున కార్యాచరణకు దిగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీలో ఉన్న ఉద్యోగ ఖాళీల లెక్కలపై అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఆర్టీసీలో కేటగిరీల వారీగా ఎన్ని ఖాళీలున్నాయి? అనే అంశంపై అంచనాలు తయారు చేస్తున్నారు. మూడు పద్ధతుల్లో బస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎంతమంది కార్మికుల అవసరం ఉంటుందనే అంశంపైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి పొద్దుపోయే వరకూ సమీక్షలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మొత్తం 50 వేల మంది వరకూ కార్మికులున్నారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో డ్రైవర్, కండక్టర్‌ కేటగిరీల్లో 1,200 మందే ఉన్నట్లు ఆర్టీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగతా ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఆర్టీసీ ద్వారా 10 వేల బస్సులు నడపాలని నిర్ణయించగా.. ఇందులో 50 శాతమే పూర్తిస్థాయిలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా 30 శాతం అద్దె ప్రాతిపదికన, మరో 20 శాతం పూర్తిగా ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో 50 శాతం బస్సులకు మాత్రమే డ్రైవర్లు, కండక్టర్లు ఉంటే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 97 బస్‌ డిపోల పరిధిలో ఐదు వేల బస్సులకు సిబ్బంది కావాలి. ప్రతి బస్సుకు ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్ల చొప్పున గణిస్తే 20 వేల మంది సరిపోతారని లెక్కలు వేస్తున్నా రు. శ్రామికుల కేటగిరీలో నాలుగువేల మందితో పాటు సూపర్‌వైజర్ కేడర్‌లో మరో 400 పోస్టులు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా 28 వేల మందిని నియమిస్తే సరిపోతుందనే దానిపై ఆర్టీసీ అధికారుల్లో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అయితే.. ఆర్టీసీలో ఖాళీలు, నియామకాలపై రెండు రోజుల్లో లెక్కలు తేల్చేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారట. ఇందులో భాగంగా అన్ని వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. అన్నింటిపైనా స్పష్టత వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కు అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తారని సమాచారం. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదించిన తర్వాత నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని ఓ అధికారి మీడియాతో చెప్పారు.కాగా.. ఆర్టీసీ సమ్మె విషయంలో అటు కార్మిక సంఘాలు.. ఇటు రాష్ట్ర సర్కార్ తమ తమ పట్టు వీడటం లేదు. డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకూ ఆందోళన చేస్తామని కార్మిక సంఘాలు భీష్మించగా.. ప్రభుత్వం కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. సమ్మెలో భాగంగా బుధవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీల మద్దతు కోరింది. మరో పక్కన సీఎంకు రవాణా కార్యదర్శి సునీల్‌ శర్మ ఇప్పటికే నివేదిక సమర్పించారు.

ఈ రెండు పక్షాల పరిస్థితి ఇలా ఉంటే ప్రయాణికుల కష్టాలు ఐదో రోజు కూడా కొనసాగాయి. దసరా సెలవులు ముగిసిపోతుండటంతో తిరుగు ప్రయాణాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వస్తున్న వారి నుంచి ప్రైవేటు వాహనాలు రెట్టింపు చార్జీలు వసూలు చేస్తూ దోచేస్తుండడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో కొన్ని బస్సుల్ని ఆర్టీసీ నిర్వహిస్తున్నప్పటికీ డిమాండ్‌కు సరిపడా బస్సులు రోడ్డెక్కడం లేదు. ఈ నేపథ్యంలో పల్లెలకు వెళ్తున్న ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల జేబులు గుల్ల చేసేస్తున్నారు. సాధారణ బస్సు టికెట్లు కంటే రెట్టింపు వసూళ్లు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. గురు, శుక్ర, శనివారాల్లో ఈ రద్దీ మరింతగా పెరగనుంది. ఈ సమయంలో ఆర్టీసీ మరిన్ని బస్సులు నడిపితే తప్ప ఇబ్బందులు తప్పేట్టు లేదని ప్రయాణికులు వాపోతున్నారు.