చిల్లర సమస్యకు చెక్..తగ్గిన కనీస చార్జి!

13 January, 2018 - 10:10 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: నగరంలోని సిటీ బస్సుల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న చిల్లర సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఇకపై టికెట్ ధరలు అడ్డదిడ్డంగా లేకుండా రౌండ్ ఫిగర్ ఉండేలా తెలంగాణ ఆర్టీసీ సవరించింది. ఇప్పటివరకు రూ.7గా వున్న కనీస టికెట్‌ ధర రూ.5కు తగ్గనుంది. ఇకపై టికెట్లు అన్నీ రూ.5, రూ.10, రూ.15 ధరల్లో చార్జీలు రౌండ్ ఫిగర్‌గా ఉండనున్నాయి. రూ.8, రూ.11, రూ.17, రూ.22, రూ.28తో ఉన్న టికెట్ ధరలు రూ.5, రూ.10, రూ.15, రూ.20, రూ.25, రూ.30గా మారనున్నాయి. దీంతో ఇక రూపాయి, రెండు రూపాయల చిల్లర సమస్య దాదాపుగా తీరిపోనుంది. హైదరాబాద్, వరంగల్‌ల లోని సిటీ బస్సులకు ఇది వర్తిస్తుంది.

సవరించిన ధరలు సంక్రాంతి సందర్భంగా సోమవారం నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాల్లో అమల్లోకి రానున్నాయని ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. చిన్నపిల్లలకు జారీ చేసే హాఫ్ టికెట్ విషయంలోనూ చిల్లర సమస్య తలెత్తకుండా రౌండ్ ఫిగర్ చేసినట్టు పేర్కొన్నారు. ఆర్టీసీ నిర్ణయం విని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిల్లర సమస్యలపై ఇన్నాళ్లకు స్పందించినందుకు ఆర్టీసీకి ధన్యవాదాలు చెబుతున్నారు.

2016 జూన్‌లో ఆర్టీసీ టికెట్‌ ధరలను సవరిం చింది. దీంతో సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనిష్ట టికెట్‌ ధర రూ.7గా మారింది. స్టేజీల సంఖ్య పెరిగే కొద్దీ రూ.8, 9, 11, 13, 16, 17, 18, 19… 28 వరకు వివిధ ధరలు నిర్ణయించారు. మెట్రో బస్సుల్లో రూ.8 నుంచి రూ.31 వరకు, మెట్రో డీలక్స్‌లలో రూ.9 నుంచి రూ.32 వరకు నిర్ధారిం చారు. అయితే టికెట్‌ ధరల కారణంగా చిల్లర సమస్య ఉత్పన్నమైంది. ప్రయా ణికులు సరిపడా చిల్లర ఇవ్వక పోవడం, కండక్టర్ల వద్ద చిల్లర సరిపోకపోవడంతో ఇబ్బందిగా మారింది. దీని కారణంగా ప్రయాణికులు, కండక్టర్ల మధ్య వాగ్వా దాలు, ఘర్షణలు కూడా జరిగాయి. ఆర్టీసీ అధికారులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో టికెట్‌ ధరలను హేతుబద్ధీకరించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.