తెలంగాణ స్పీకర్‌కు తప్పిన ప్రమాదం

09 June, 2018 - 2:48 PM

(న్యూవేవ్స్ డెస్క్)

భూపాల‌పల్లి: తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో ప్రమాదం తప్పింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ సంఘటన శనివారం జరిగింది. గణపురం నుంచి భూపాలపల్లికి వెళ్తుండగా స్పీకర్ ఎస్కార్ట్ వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. దేవాదుల ప్రాజెక్టు పనుల నిమిత్తం పైపులను తీసుకు వెళ్తున్న లారీ ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఆ వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్పీకర్ మధుసూదనాచారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మధుసూదనాచారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చారు.

ఈ ప్రమాదంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు మధుసూదనాచారికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ సంఘటన జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, గణపురంలో శుక్రవారం రాత్రి మధుసూదనాచారి పల్లెనిద్ర చేశారు. శనివారం ఉదయం స్థానిక ప్రజలతో కలిసి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి నాగలి పట్టిన ఆయన దుక్కిదున్నారు. ఈ పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.