తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

15 February, 2020 - 7:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఎంసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19న ఎంసెట్ నోటిఫికేషన్ రానుంది. ఈ నెల 30 వరకు విద్యార్థులు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అందుకు 20 నుంచి మార్చి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ. 5 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు స్వీకరించనున్నారు.

రూ. 10 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఉన్నత విద్య మండలి స్పష్టం చేసింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తులో సవరణలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. మే 4, 5, 7 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష.. మే 9, 11 తేదీల్లో ఎంసెట్ వ్యవసాయ, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి పేర్కొంది.

ఎంసెట్‌కు తెలంగాణలో 51, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష ఫీజుల్లో ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు రాయితీ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు రూ. 400, ఇతరులకు రూ.800 పరీక్ష ఫీజుగా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ అమలుకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఎంసెట్ దరఖాస్తులో మాత్రం ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఉంటుందని పాపిరెడ్డి అన్నారు.