గూండాగిరి నడవది.. ఆందోళన చేస్తే.. కఠిన చర్యలు

13 October, 2019 - 2:24 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: సమ్మెను ఉధృతం చేస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి చేస్తున్న ప్రకటనలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె పేరుతో బస్టాండ్లు, బస్‌ డిపోల వద్ద బస్సుల్ని అడ్డుకుని ఆందోళన చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గూండాగిరి నడవదని, ఇప్పటి వరకూ ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉందని, ఇకపై కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తలెత్తిన పరిస్థితులపై ప్రగతి భవన్‌లో కేసీఆర్ సమీక్షించారు. ఆర్టీసీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్న కార్మికులను క్షమించే ప్రసక్తే లేదన్నారు. మూడు రోజుల్లోగా నూరు శాతం బస్సులు నడిపి తీరాల్సిందే అని అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్‌ లీడర్లుగా చెప్పుకునే కొందరు ప్రకటిస్తున్నారని, సమ్మెను ఉధృతం చేసినా ప్రభుత్వం చలించదని, బెదిరింపులకు భయపడేది లేదని కేసీఆర్‌ అన్నారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరిపేదిలేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. బస్టాండ్లు, బస్ డిపోల వద్ద ఎవరైనా బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

ప్రతి ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తు పెంచాలని, అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి సమీక్ష సమావేశం నుంచే సీఎం కేసీఆర్ ఫోన్‌ చేసి ఆదేశించారు. అవసరమైతే ఇంటెలిజెన్స్‌ పోలీసులనూ ఉపయోగించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలని, ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదని సీఎం అన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మె నేపథ్యంలో చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో కేసీఆర్ సమీక్షించారు. కండక్టర్లు, డ్రైవర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని, అద్దె బస్సులకు త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం సూచించారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెలో పాల్గొన్న ఏ ఒక్క కార్మికుడినీ తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. సమ్మెకు దూరంగా ఉన్న కార్మికులకు మాత్రమే సెప్టెంబర్ నెల జీతాలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకూడదనే దసరా సెలవుల్ని పొడిగించినట్లు కేసీఆర్ చెప్పారు.

కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్ని నడిపేందుకు రిటైర్డ్ ఆర్టీసీ, పోలీసు శాఖ డ్రైవర్లను తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యూనియన్ నాయకుల మాటలు నమ్మి కార్మికులే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు కానీ.. ప్రభుత్వం ఎవరినీ తొలగించలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఆర్టీసీ పర్యవేక్షణ అధికారులను కూడా సమ్మెలోకి దింపిన యూనియన్ నాయకులు అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్ నాయకులే 48 వేల మంది కార్మికుల ఉద్యోగాలు పోయేలా చేశారని అన్నారు. అర్ధరహిత డిమాండ్లతో చట్ట విరుద్ధంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం అనైతికం అని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అసలు సరైన ప్రతిపక్షమే లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు ఫలించేంది లేదన్నారు.

కాగా.. ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో డ్రైవర్‌ బోయిన వెంకటేశ్వరాచారి పెట్రోల్‌ పోసుకుని నిప్పుంటించుకోగా తోటి కార్మికులు సకాలంలో స్పందించి ఆర్పివేశారు. ఈ పరిణామాలతో గుర్తు తెలియని కొందరు బస్సులపై రాళ్ళు రువ్వారు. దీంతో ఖమ్మం బస్‌ డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.