భద్రతా సలహాదారుపై ట్రంప్ వేటు

11 September, 2019 - 6:17 AM

(న్యూవేవ్స్ డెస్క్)

 వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌ను విధుల నుంచి తప్పిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. శ్వేతసౌధంలో మీ సేవలు ఇక చాలని, సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు, రాజీనామా చేయాలని జాన్ బోల్టన్‌కు సోమవారం రాత్రే చెప్పగా.. మంగళవారం ఉదయమే రాజీనామా లేఖను తనకు సమర్పించారని ట్రంప్ స్పష్టం చేశారు. బోల్టన్ ఇన్నాళ్లుగా అందజేసిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్రంప్ ట్వీట్ చేశారు. వచ్చే వారం కొత్త జాతీయ భద్రతా సలహాదారు ఎవరనేది వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

కాగా.. జాన్ బోల్టన్ ఇచ్చిన అనేక సలహాలను తాను తీవ్రంగా వ్యతిరేకించానని ట్రంప్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. జాన్ బోల్టన్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా 2018 ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టారు. వైట్‌హౌ‌స్‌కు బోల్టన్ సరిపోరు. ఆయన ఇచ్చిన సలహాలేవీ నాకు ఆమోదయోగ్యంగా అనిపించలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయంపై బోల్టన్‌ స్పందిస్తూ.. నేను సోమవారం రాత్రే ట్రంప్‌కు రాజీనామా సమర్పించాను అని ట్వీట్‌ చేశారు.