ట్రంప్- కిమ్ చరిత్రాత్మక భేటీ…!

12 June, 2018 - 11:34 AM

(న్యూవేవ్స్ డెస్క్)

సింగపూర్: ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అరుదైన సమావేశం మంగళవారం ఉదయం సింగపూర్‌‌లో జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌- ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భేటీ అయ్యారు. ఈ చారిత్రక సమావేశానికి సింగపూర్ వేదికైంది. సెంతోసా దీవిలోని కాపెల్లా హోటల్‌‌లో ఈ ఇద్దరు దేశాధినేతలు శాంతి చర్చల్లో పాల్గొన్నారు. ట్రంప్- కిమ్ సమావేశమైన హోటల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ట్రంప్- కిమ్ ఏకాంతంగానే సమావేశమయ్యారు. ఉత్తరకొరియా పూర్తి అణునిరాయుధీకరణ చేయాలని ట్రంప్ కోరుతున్నారు. మరో పక్కన తమ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కిమ్ పట్టుబడుతున్నారు. అయితే ఈ శిఖరాగ్ర సమావేశం ఎజెండా ఏంటన్నది రహస్యంగా ఉంచారు.

కొద్ది కాలం క్రితం వరకూ పరస్పరం విమర్శలు సంధించుకున్న ట్రంప్- కిమ్ కీలక చర్చలు జరిపారు. ఉత్తర కొరియాను అణునిరాయుధీకరణకు ఒప్పించడమే ప్రధాన ఎజెండాగా అమెరికా, ఉత్తర కొరియా అధినేతల మధ్య ఈ శిఖరాగ్ర సమావేశం జరిగింది. దాదాపు 48 నిమిషాల పాటు ట్రంప్‌, కిమ్‌ మధ్య చర్చలు జరిగాయి. అణ్వాయుధాల విషయంలో కిమ్‌‌తో ట్రంప్‌ చర్చించారు. అణ్వాయుధాలను వీడాలని, అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సహకరించాలని కిమ్‌‌కు ట్రంప్ సూచించారు. ఇందుకు అంగీకరిస్తే.. ఉత్తర కొరియా భద్రతకు హామీ ఇస్తామని, ఆర్థిక సాయం కూడా అందిస్తానని ట్రంప్‌ ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదని ఆసక్తికరంగా మారింది.
అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల భేటీని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా కిమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపైనే అందరి దృష్టి ఉంది. అదీగాక సమావేశం సజావుగా సాగకపోతే తాను భేటీ మధ్యలోనుంచి వెళ్లిపోతానంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. దాంతో అమెరికా అధ్యక్షుడి వ్యవహార తీరు కూడా ఆసక్తిని రేపుతోంది. ఒకవేళ చర్చలు ఫలిస్తే కొరియా ద్వీపకల్పనలో శాంతి నెలకొంటుంది.హోటల్లో ముఖాముఖి ఎదురుపడగానే కిమ్-ట్రంప్ చేతులు కలిపారు. సింగపూర్ సహా పలు దేశాల జోక్యంతో ఈ భేటీ జరిగింది. ఈ భేటీ కోసం వివిధ దేశాల నుంచి తరలివచ్చిన 2,500 మందికి పైగా మీడియా ప్రతినిధుల కోసం పసందైన విందు ఏర్పాట్లు చేశారు. ట్రంప్- కిమ్ మూడు రోజులకు పైగా సింగపూర్‌‌లో ఉంటారు. భారతీయ వంటకాలైన పలావ్‌, కోడి కూర, కోడి కుర్మా, పప్పు, చేపల కూర, అప్పడం వంటివి కూడా వీరికి వడ్డించే పదార్థాల జాబితాలో ఉన్నాయి. మొత్తం 45 రకాల వంటకాలు ఉన్నాయి. భారత్‌‌తో పాటు సింగపూర్‌, మలేసియా, వియత్నాం, థాయ్‌‌లాండ్‌, కొరియా, జపాన్‌, చైనా, ఫ్రాన్స్‌, అమెరికా, ఇటలీ, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, మధ్యప్రాచ్య దేశాలు.. ఇలా పదిహేను భిన్న ప్రాంతాల రుచులు ఉన్నాయి. ముఖ్యంగా సింగపూర్‌‌లో ప్రసిద్ధ వంటకాలైన లక్సా, చికెన్‌ రైస్‌ ఉన్నాయి. వంటల తయారీ బృందంలో భారతీయ పాకశాస్త్ర నిపుణుడు అమిత్‌ వర్మ ఉన్నారు.

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తానెంత వైవిధ్యుడో అనే విషయాన్ని మరోసారి నిరూపించారు. సింగపూర్ వచ్చిన ఆయన గత అర్ధరాత్రి సింగపూర్ వాసులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. చర్చలకు ఒకరోజు ముందే తన సోదరి కిమ్ యో జాంగ్, విదేశాంగ మంత్రి రీ యాంగ్ హోలతో కలసి వచ్చిన ఆయన రాత్రి పూట వీధుల్లోకి వచ్చి, తీరంలో కాసేపు నడిచారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో కలసి సెల్ఫీలు దిగారు.కిమ్‌ జాంగ్‌ ఉన్‌ విలక్షణమైన వ్యక్తే. ఆయన చేసే ప్రతీ పనీ వార్తలకు ఎక్కుతూనే ఉంటుంది. ట్రంప్‌‌తో శిఖరాగ్ర చర్యలకు సింగపూర్‌ వచ్చిన కిమ్‌ వెంట ఓ మొబైల్‌ టాయ్‌‌లెట్‌ కూడా వచ్చింది. అది కిమ్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేయించినది. మీడియా కథనాల ప్రకారం కిమ్‌ తన ఆరోగ్య రహస్యాలను పశ్చిమ దేశాలు కనిపెట్టకుండా ఈ జాగ్రత్త తీసుకున్నారు. ‘కిమ్‌ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్థూలకాయుడైన ఆయనకు స్వతహాగా ఫాటీ లీవర్‌ ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల వాతం కూడా ఉన్నాయి. తన మల, మూత్రాదులను పరీక్షించి పశ్చిమ దేశాలు తన ఆరోగ్య సమస్యను అంచనా వేస్తాయన్నది ఆయన భయం. అలాంటి అవకాశం ఇవ్వకుండా ఎటువంటి పరీక్షలకూ లొంగని రీతిలో విసర్జనను డిస్పోజ్‌ చేయగల అత్యాధునికమైన టాయ్‌‌లెట్‌‌ను తన కోసం ఆయన తయారు చేయించుకున్నారని దక్షిణ కొరియా వార్తాపత్రిక ఓ కథనంలో పేర్కొంది.

నిజానికి అమెరికా, ఉత్తరకొరియా రాజకీయంగా భిన్నధృవాలు. సంపన్న క్యాపిటలిస్టు ప్రజాస్వామ్య దేశమైన అమెరికా, ఏకపార్టీ నియంతృత్వంలో మగ్గిపోయిన ఉత్తర కొరియాతో చర్చలకు దిగుతుందని ఎవరూ ఊహించలేదు. పైగా ఇటీవల కాలంలో ట్రంప్, కిమ్ మధ్య మాటల క్షిపణులు పేలాయి. ఒకరినొకరులు వ్యక్తిగతంగా తీవ్రంగా దూషించుకున్నారు. ఒక దశలో రెండు దేశాలకు మధ్య యుద్ధం తప్పదా అన్నట్లు పరిస్థితి కనిపించింది. అందుకే ఈ చర్చలపై అనేక అనుమానాలు కలిగాయి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ట్రంప్, కిమ్ భేటీ అవడం విశేషం.