హెచ్-1బీ వీసా.. ఇకపై మరింత కఠినం

25 December, 2017 - 12:35 PM

(న్యూవేవ్స్ డెస్క్)

వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారత ఐటీ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్‌. హెచ్‌-1బీ వీసా జారీ విధానాన్ని మరింత కఠినతరం చేసేందుకు అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ప్రతిపాదనను సిద్ధం చేసింది. హెచ్‌-1బీ వీసా పిటిషన్‌దారుల ఎంపిక ప్రక్రియపై కఠినమైన ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్‌ సంస్థ ఫ్రాగోమెన్‌ పేర్కొంది.

ఫ్రాగోమెన్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన తాజా సమాచారం ప్రకారం.. హెచ్‌-1బీ వీసా నిబంధనలపై 2011లో చేసిన ప్రతిపాదనను హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ తాజాగా మరోసారి పునరుద్ధరించనుంది. అంటే హెచ్‌-1బీ కోసం దరఖాస్తు చేసుకునే పిటిషన్‌దారులు ముందుగా హెచ్‌-1బీ క్యాప్‌ లాటరీ కోసం రిజిస్టర్‌ చేసుకోవాలి. క్యాప్‌ నంబర్లు వచ్చిన తర్వాతే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నంబర్ల కేటాయింపు కోసం ప్రాధాన్యత పద్ధతిని పాటించేలా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ప్రతిపాదన చేసే యోచనలో ఉంది. దీని ప్రకారం ఎక్కువ నైపుణ్యత ఉన్న వారికి, ఎక్కువ జీతం వచ్చే వారికి ఈ క్యాప్‌ నంబర్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఇప్పటికే హెచ్-1బీ వీసాల జారీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇటీవల హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయకుండా ఉండే విధంగా ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తాజాగా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ ప్రతిపాదన వీసా పిటిషన్‌దారులకు మరింత నిరాశను కలిగిస్తోంది.