టీఆర్ఎస్‌లో ముసలం పుట్టిందా..?

12 January, 2018 - 7:20 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంపై స్వపక్షం నుంచే విమర్శల పరంపర కొనసాగుతోంది. నిన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, నేడు పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ఒక విధంగా టీఆర్ఎస్‌‌కు గట్టి షాక్ అనే చెప్పొచ్చు. అనాయాచితంగా మాట్లాడినా, అనుకునే మాట్లాడినా వీరిద్దరి వ్యాఖ్యలు టీఆర్ఎస్‌లో ముసలం తీసుకు వచ్చే అవకాశాలను తీసి పారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యాఖ్యలు గులాబీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు కూడా అద్దం పడుతున్నాయని భావించవచ్చని అంటున్నారు.

గతంలో కేసీఆర్‌‌ను బండబూతులు తిట్టినవారే ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో కొనసాగుతున్నారని, మరి కొందరు ఎంపీలుగా ఉన్నారంటూ గురువారంనాడు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌‌గౌడ్‌ తాజాగా శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి నాయిని చేసిన వ్యాఖ్యలు వందశాతం సరైనవని శ్రీనివాస్‌‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్లు ఇప్పుడు కేబినెట్‌లో ఉన్నారని చెప్పారు. ఇది తలుచుకుంటేనే తన కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయని చెప్పారు. అయితే.. కేసీర్ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉంటుందని, ఉద్యోగులు లేనిదే సకల జనుల సమ్మె లేదని చెప్పడం దేనికి సంకేతమో ఊహించుకోచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.

తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీని నామరూపాలు లేకుండా చేయడానికే ఆ పార్టీ వారిని టీఆర్ఎస్‌లో చేర్చుకున్నామని నాయిని చెప్పడం కలకలం రేపుతోంది. ఆ మరుసటి రోజే శ్రీనివాస్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. టీఆర్ఎస్ నేతలు, కేబినెట్ మంత్రులు వరుసగా ఇలా వ్యాఖ్యలు చేయడం కేసీఆర్‌‌కు తలనొప్పి తెచ్చిపెట్టే అంశమని విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీలో ఉండి, ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరి మంత్రులైన నేతలు పలువురు ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డి తదితరులు కొందరు ఉన్నారు. వీరిలో ఎవరిని ఉద్దేశించి నాయిని, శ్రీనివాస్‌గౌడం ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చిన వారిని టీఆర్ఎస్‌లో చేర్చుకోవడమే కాకుండా కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నేతలకు అప్పుడప్పుడూ విపక్షాల నుంచి ఇరుకున పెట్టే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆనాడు తెలంగాణ కోసం పోరాడని వారికి పదవులు కట్టబెట్టారని.. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో కూడా ఈ అసంతృప్తి ఉంది. దీన్ని గమనించే నాయిని, శ్రీనివాస్‌గౌడ్ ఇలా వ్యాఖ్యానించి ఉంటారా అనే చర్చ కూడా సాగుతోంది.