ఇక తెలంగాణలో ‘సమస్యలు’ నిషేధం, జీవో జారీ

17 May, 2017 - 12:28 AM

(న్యూవేవ్స్ ఫేకింగ్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి)

మే 15న ధర్నాచౌక్ ఆక్యుపై ఆందోళన పరిణామాల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. సూదిపార్టీ, దబ్బనం పార్టీల వల్లే ఇంత రభసా జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తోకపార్టీలకు పని లేదనీ అందువల్లే ఇలాంటి పనికిరాని దిక్కుమాలిన ఉద్యమాలకు దిగి బద్‌నాం చేస్తున్నాయనీ ఆయన విమర్శించారు. ధర్నాచౌక్ ఘటవలపై ఆయన మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు పలువురు మంత్రులు, సీఎస్, డీజీపీ తదితర అధికారులు పాల్గొన్నారు. కోట్లు ఖర్చు పెట్టి సీఎం క్యాంప్ ఆఫీసు కట్టి ప్రగతి భవన్ అని పేరు పెట్టాక కూడా రాష్ట్రంలో ఇంకా సమస్యలు ఉండడమేమిటని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. పైగా తరచు పత్రికల్లో వివిధ పథకాలపై ఫుల్‌పేజీ అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తున్నా సమస్యలుండడం తమాషాగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

తనతో పాటు తన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీశ్ రావు రేయింబవళ్లు కష్టపడుతున్నా సన్నాసులు కొందరు సమస్యలంటూ ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ విషయమే చెప్పానని ఆయన తెలిపారు.

‘ధర్నా చేసేటోడు ఏం మొగోడా? ఏ పని మొదలుపెట్టినా దుర్మార్గంగా కోర్టులకు వెళుతున్నారు. ధర్నాలకు దిగుతున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేవంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదంటున్నారు. పాపాత్ములు ఇంకా ఏవేవో పనికిరాని డిమాండ్లు చేస్తున్నారు. సమస్యలని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అసలు సమస్యలంటూ ఉంటేనే కదా ధర్నాలు చేసేది? అందుకే సమస్యలనే నిషేధించండి!”అని కేసీఆర్ ఆదేశించారు. అలా కుదరకపోవచ్చునేమోనని జంకుతూనే సందేహం వ్యక్తం చేసిన సీఎస్‌పై ఆయన తీవ్రంగా ఆగ్రహించారు. దాంతో కేసీఆర్ ఆదేశాల మేరకు సమస్యలను తక్షణం నిషేధిస్తూ జీవో ఎంఎస్ ౦౦ రాత్రికి రాత్రి జారీ అయింది.

ఈ జీవో ప్రకారం రాష్ట్రంలో ఎక్కడా ఏ సమస్యలూ ఉండకూడదు. సమస్యని ఎవరైనా లేవనెత్తితే ఐపీసీ 120 ఏ సెక్షన్ కింద క్రిమినల్ కాన్స్ఫిరసీ కేసు పెట్టి వారిని తక్షణం అరెస్టు చేస్తారు. వారికి బెయిలు కూడా రాదు. సమస్యలే లేనప్పుడు ధర్నాలు ఉండవు. కాబట్టి ధర్నాచౌక్‌లూ అక్కర్లేదు. సుభిక్షమైన కేసీఆర్ పరిపాలనను ఎవరైనా విమర్శిస్తే ‘స్థానికులే’ వాళ్ల పనిబట్టేలా జీవోలో వెసులుబాటు కల్పించారు. ఈ ‘స్థానికులకు’ ఫ్రీ బస్‌పాస్‌లిస్తారు. హోంగార్డుల్లా వారికి ప్రత్యేకంగా కొంత భత్యాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. వారు ‘డ్యూటీ’లో ఉన్నప్పుడు వారికి బిర్యానీ పొట్లాలూ సరఫరా చేస్తారు. ఇందుకు ఆర్థికశాఖ ఆమోదం కూడా లభించింది.

సమస్యలన్నిటినీ నిషేధిస్తూ జారీ అయిన ఈ జీవోను టీఆర్ఎస్ స్వాగతించింది. కేసీఆర్ అంటే తెలంగాణ జాతిపిత అనీ, అలాంటి నేతపై సమస్యలంటూ తిరగబడడం, ధర్నాలకు దిగడం దుర్మార్గమనీ టీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. కాగా ఈ జీవో వల్ల ఇక సమస్యలన్నీ తొలగిపోయినట్లేనని కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ఈ వినూత్న పద్ధతిని ఫాలో కావాలని, అప్పుడే సమస్యలంటూ లేకుండా పోతాయనీ ఆయన తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. కానీ వామపక్షాలు, బీజేపీ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ మాత్రం ఒక ప్రకటనలో ఈ జీవోను తీవ్రంగా ఖండించాయి.