త్రివిక్రమ్ ‘కొత్త బిజినెస్’

15 October, 2019 - 4:47 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్:  టాలీవుడ్ హీరోలు ఇటు సినిమా రంగంలోనే కాదు… అటు వ్యాపార రంగంలో కూడా తమదైన శైలిలో దూసుకుపోతూ… కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. అందుకు జూనియర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ ఉదాహరణ. తాజాగా వారి సరసన ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేరనున్నారని సమాచారం. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ మల్టిఫ్లెక్స్‌ తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను సంపాదించిన నగదును మల్టీఫ్లెక్స్ ‌కోసం పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం అల.. వైకుంఠపురంలో… . ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకోంటుంది. 2020, జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. హారికా, హసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చినబాబు, అల్లు అరవింద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించిన విషయం విదితమే.