ఏమిటీ పిడకల వేట!

13 June, 2017 - 9:00 PM

video

నవ్యాంధ్ర రాజకీయాలపై ప్రత్యేక వార్తాకథనం కోసం క్లిక్ చేయండి!

2014 జూన్ 2

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన రోజు…

దక్షిణాది రాష్ట్రాలలో విస్తీర్ణం దృష్ట్యా, జనాభా రీత్యా కూడా అన్నిటికన్నా పెద్దదయిన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోయి దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన రోజు. ఈ విభజన ఫలితంగా 400 ఏళ్లకు పైబడి చరిత్ర ఉన్న రాజధాని నగరం హైదరాబాద్ తెలంగాణాకు పరిమితమై పోయింది.

రాజధాని నగరం లేకుండా మిగిలిపోయిన అవశేష ఆంధ్రప్రదేశ్ గుంటూరు, విజయవాడల మధ్య అమరావతి నగర నిర్మాణానికి పూనుకున్నది. 2014 ఎన్నికలలో విజయం సాధించి నవ్యాంధ్ర పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం అలా నిర్ణయించింది. ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి, రాజధానిగా అమరావతి నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజధాని కోసం భూసేకరణ తతంగం అంతా పూర్తయిన తర్వాత కూడా, తాము అధికారంలోకి వచ్చినపుడు అమరావతి భూములను రైతులకు తిరిగి ఇస్తామంటూ వచ్చారు.

రాజధాని వివాదం అలా ఉండగా నవ్యాంధ్ర పయనం ఎలా ఉంది?

పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పాస్ చేసినపుడు అవశేష రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీని ఆ తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కింది.  అమరావతి శంఖుస్తాపనకు వచ్చిన ప్రధాని మోదీ కాస్త మట్టిని, కాసిని నీళ్లను ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నవ్యాంధ్రలో సహనం నశిస్తున్న సూచనలు కనబడిన తర్వాత ప్రత్యేక ప్యాకేజిని తెరపైకి తెచ్చారు. దానితోనే తృప్తి పడక తప్పని స్తితిలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్యాకేజికి చట్టబద్ధత కోరింది. ఎన్‌డిఎ ఏలుబడిలో దానికి ఇంతవరకూ దిక్కు లేదు.

మరో పక్క అతిపెద్ద ఆర్ధిక వనరు అయిన హైదరాబాద్‌ను కోల్పోయిన నవ్యాంధ్ర నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. అనావృష్టి, అకాల వర్షాలు కలిసి అసలే అంతంత మాత్రంగా ఉన్న రైతుల నడ్డి విరిచాయి. మిర్చి తదితర వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యలు కొనసాగడంలో ఆశ్చర్యం ఏముంది? మరో పక్క ఉపాధి అవకాశాల పరిస్థితి కూడా అస్తవ్యస్థంగా ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాల్సి ఉండగా పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టులకు కూడా మోదీ ప్రభుత్వం అరకొర నిధులను విదుల్చుతోంది. మొత్తం  మీద పరిస్తితి చాలా నిరాశాజనకంగా ఉంది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ఏంజరుగుతోంది? పరిస్థితులను మెరుగుపరిచేందుకు, జనాన్ని ఆదుకునేందుకు రాజకీయ పక్షాలు తమ వంతుగా ఏం చేస్తున్నాయి?

ఈ కనడుతున్నది అమరావతిలో నిర్మించిన తాత్కాలిక రాజధానిలోని అసెంబ్లీ భవనం దృశ్యాలు. భారీ వర్షానికి అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత ఛాంబర్ లోకి నీళ్లు వచ్చాయి. ఎవరో గానీ వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టారు. అలాంటి అవకాశం దొరికినపుడు న్యూస్ ఛానళ్లు ఏం చేస్తాయి. పండగ చేసుకుంటాయి.

మరుసటి రోజు ఉదయం వైసిపి సభ్యులు అసెంబ్లీ భవనం దగ్గరకు వెళ్లారు. మీడియాను లోపలికి అనుమతించక పోవడంతో వారు గేటు బయటే నిరసనకు దిగారు. వందల కోట్లు వృధా చేసి నిర్మించిన భవనాల నాణ్యత ఇలా తగలబడిందని విమర్శలకు దిగారు.

ఈ లోపు ప్రభుత్వానికి చురుకు పుట్టింది. సిఆర్‌డిఎ అధికారులు లీకేజీని పరిశీలించి కప్పులోనుంచి నీరు కారలేదని నిర్ధారించారు. ఒకచోట  పైపు కోసిఉండడాన్ని గమనించిన అధికారులు ఎవరో కావాలనే దాన్ని కోసినట్లు తేల్చారు. దానితో కొత్తగా కుట్ర కోణం బయటకు వచ్చింది. అదికార పక్షానికి పెద్ద ఆయుధం దొరికింది. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పలు చేసేందుకు వైసిపి వారే ఇదంతా చేస్తున్నారని ఎదురు దాడికి దిగింది.

మరో పక్క సభాపతి కోడెల శివప్రసాద్ స్వయంగా వెళ్లి అసెంబ్లీ భవనం పరిశీలించారు. పైప్ ఎవరో కోసిన మాట వాస్తవమేనంటూ, ఈ మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేసి బాధ్యులెవరో తేల్చేందుకు విషయాన్ని సిఐడి పోలీసులకు అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ రెండు రోజులూ ఎలక్ట్రానిక్ మీడియాకు పండగే పండగ. ఈ వివాదం జరుగుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శనాస్తాలు ఎక్కుపెట్టేందుకు ప్రతిపక్ష సభ్యులకు, సమాంతరంగా సాగుతున్న మరో ప్రభుత్వ కార్యక్రమం కలిసి వచ్చింది.

నవ్యాంధ్ర ఏర్పడి ఏడాది గడిచిన తర్వాత సిఎం చంద్రబాబు రాష్ట్ర విభజన జరిగిన జూన్ రెండవ తేదీన నవనిర్మాణ దీక్షా కార్యక్రమం చేపట్టారు. ఆ రోజు మొదలుపెట్టి  కొత్త ప్రభుత్వం ఏర్పడిన రోజయిన జూన్ ఎనిమిది వరకూ ఈ దీక్షా కార్యక్రమం సాగుతుంది. ఈ సారి నవనిర్మాణ దీక్ష సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొన్ని అటు తెలంగాణాలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ విమర్శలకు దారి తీశాయి. ఆంద్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైసిపికి ఈ వ్యాఖ్యలు ఆయుధంగా దొరికాయి.

ఒకపక్క స్పీకర్ ఆదేశానుసారం సిఐడి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా, వైసిపి సభ్యులు సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. నవ్యాంధ్ర పయనంలో ప్రస్థుతం మనకు కనబడుతున్న రాజకీయం ఇది. ఈ పరిస్తితులకు ఎవరిని బాధ్యులు  చేద్దాం? ఈ పయనం రాష్ట్రాన్ని ఎక్కడకు  తీసుకువెళుతుంది?