ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీఓ సంఘం మద్దతు

15 October, 2019 - 8:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో కీలక పరిణామం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఎన్జీఓ సంఘం మంగళవారం మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపింది. ఆర్టీసీ సమ్మెలో తాము కూడా భాగస్వామ్యం అవనున్నట్టు వెల్లడించింది. మరోపక్కన తాము చేపట్టిన సమ్మెకు మద్దతు ఇవ్వాలని కొద్ది రోజులుగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉద్యోగ సంఘాలను కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ జేఏసీ నాయకులు మంగళవారం టీఎన్జీఓ నేతలతో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలవాలని జేఏసీ నాయకులు.. టీఎన్జీవో నేతలను కోరారు.

భేటీ అనంతరం టీఎన్జీఓ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు. ఆర్టీసీ సమ్మెలో తాము కూడా భాగస్వాములం అవుతామని తెలిపారు. బుధవారం ఉద్యోగ సంఘాల సమావేశం జరుగుతుందని.. సీఎస్‌ను కలిసి సమస్యలు వివరిస్తామని చెప్పారు. సమస్యలు పరిష్కారం కాకపోతే మరో సకలజనుల సమ్మెకు సిద్ధం కావాల్సి వస్తుందని రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం తమ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.

ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓలు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. టీఎన్జీఓలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ తిరోగమనంలో పడిందన్నారు. ఆర్టీసీలో కొత్త నియామకాలు లేవని.. రూ. 1400 కోట్ల కార్మికుల పీఎఫ్‌ సొమ్మును యాజమాన్యం వాడుకుందని ఆరోపించారు. తప్పని పరిస్థితుల్లోనే తాము సమ్మె నోటీసు ఇచ్చినట్టు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో లేనివాళ్లు తమను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పిలిచినా.. ఆర్టీసీ యాజమాన్యం పిలిచినా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతానికి సమ్మె యథావిథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని, ఎంపీ కేకే సహా ఎవ్వరూ తమతో మాట్లడలేదన్నారు. కార్మికులతో చర్చించి, సమస్య పరిష్కరించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించిందని అశ్వత్థామరెడ్డి చెప్పారు.

ఇక.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానంటూ భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించి 11 రోజులు కావస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ మొండి వైఖరితో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తుంటే.. ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారపూరితంగా మాట్లాడిన కేసీఆర్ వల్లే కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులతో కలసి కార్మికులపై సీఎం కేసీఆర్ పెత్తనం చేస్తున్నారన్నారు. బేషజాలకు పోకుండా ఈ నెల 19వ తేదీ లోపు ఆర్టీసీ సమ్మెను పరిష్కరించకపోతే.. 21న ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.