ఇకపై ఒక్కొక్కరికి 10 లడ్డూలు..!

11 January, 2018 - 9:29 AM

(న్యూవేవ్స్ డెస్క్)

తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానము తీపి కబురు అందించింది. తిరుపతి వెళ్లాము అని చెప్పగానే గల్లీ నుండి ఢిల్లీ దాకా అందరూ అడిగే ప్రశ్న ఒక్కటే… లడ్డూ ఎక్కడ అని. తిరుపతి లడ్డును పంచడంతోపాటు పుచ్చుకోవడమూ ఓ దర్జానే. వడ నుండి చక్కెర పొంగలి వరకు శ్రీవారి ప్రసాదాలు ఎన్నున్నా… లడ్డూకు మాత్రం తిరుగులేదు. అలాంటి లడ్డూలు ఇకపై ఎన్ని కోరితే అన్ని ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది.

తిరుమల శ్రీవారి భక్తులకు ఇప్పటి వరకూ రెండు లడ్డూలు మాత్రమే ఇస్తుండగా ఇకపై అదనంగా 10 లడ్డూల వరకు ఇవ్వనున్నారు. భక్తులకు కోరినన్ని లడ్డూలు అందజేయాలన్న లక్ష్యంతో ఇటీవల లడ్డూల తయారీని పెంచడంతో దాదాపు 7లక్షల లడ్డూలు నిల్వ ఏర్పడ్డాయి. దీంతో మంగళవారం నుంచి ఎటువంటి సిఫారసు లేకుండా భక్తుడు కోరితే 6 లడ్డూల వరకు ఇస్తున్నారు.

అయితే బుధవారం కూడా కోటా మిగిలే పరిస్థితి రావడంతో జేఈవో శ్రీనివాసరాజు సీనియర్‌ అధికారులతో చర్చించి భక్తుడు కోరితే 10 లడ్డూల వరకు ఇవ్వాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించారు. దీంతో బుధవారం మధ్యాహ్నం నుంచి రూ.50 చొప్పున భక్తులకు 10 లడ్డూల వరకు జారీచేశారు. ఇకమీదట కూడా భక్తులకు ఎటువంటి సిఫారసు లేకుండా ఒక్కొక్కరికి 10 లడ్డూలు అందించనున్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో గత నెల 18న దివ్యప్రబంధ అధ్యయనోత్సవాలు గురువారం ముగియనున్నాయి.

మరోవైపు కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఈ నెల 16వ తేదీన పార్వేట ఉత్సవం కన్నుల పండువగా జరుగనుంది. అదేరోజు సాయంత్రం గోదా పరిణయోత్సవం నిర్వహిస్తారు.