పట్టాలు తప్పిన హౌరా మెయిల్

10 June, 2018 - 1:07 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: మహారాష్ట్రలోని ఇగత్‌‌పురి రైల్వే స్టేషన్‌ సమీపంలో హౌరా మెయిల్‌ రైలు ఆదివారం తెల్లవారు జాము 2 గంటల సమయంలో పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది. రైల్వే భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో రైల్వే ట్రాక్ దెబ్బతినడం వల్ల ఈ మార్గంలో నడిచే 12 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఏడు రైళ్లను దారి మళ్లించింది.

నాగపూర్ మీదుగా ప్రయాణించే ముంబై- హౌరా మెయిల్ ( రైలు నంబర్ 12809) ముంబై డివిజన్ పరిధిలో ఈ తెల్లవారు జామున 2.05 గంటల సమయంలో పట్టాలు తప్పిందని సెంట్రల్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సునీల్ ఉదాసి ధ్రువీకరించారు. ప్రయాణకులకు ఎవరికీ గాయాలు కాలేదని ఆయన చెప్పారు. ఎస్12, ఎస్13తో పాటు ప్యాంట్రీ కారు కోచ్ పట్టాలు తప్పిందని తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడిందని, త్వరలోనే మార్గాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు.

పూణె- దాండ్- ముంబై మార్గంలో దారి మళ్లించిన రైళ్ల వివరాలు ఇవీ. అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ (11057), గువాహటి ఎక్స్‌ప్రెస్ (15645), వారణాసి ఎక్స్‌ప్రెస్ (12167), వారణాసి మహానగరి ఎక్స్‌ప్రెస్ (11093), పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ (12141), పాన్వెల్ గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (15066), ఎల్‌టీటీ- హాతియా ఎక్స్‌ప్రెస్ (12811). సాయం కోసం పంప్రదించాల్సిన నంబర్లు 0251-2311499, 022-24114836, 02553-244020.