జనసేన ప్రధాన కార్యదర్శిగా తోట

18 May, 2018 - 8:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విశాఖపట్నం: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాజీ ఐఏఎస్ అధికారి, ప్రముఖ రాజకీయవేత్త తోట చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుక్రవారం ప్రకటించారు. తోట చంద్రశేఖర్‌తో తనకు పదేళ్ల వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంచి పరిపాలనాధక్షుడిగానే కాకుండా పారిశ్రామికవేత్తగా కూడా ఆయన విజయం సాధించారని చెప్పారు.పౌర పరిపాలనలో తోట చంద్రశేఖర్‌కున్న పట్టు, శక్తి సామర్థ్యాలు అపారమైనవి అని పవన్ తెలిపారు. ఆయన దీక్షాదక్షత జనసేన పార్టీని విస్తృత పర్చడానికి ఉపయోగడుతుందని తాను, జనసేన పార్టీ ప్రతినిధులు గట్టిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా తోట చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రమాణాన్ని ఆచరించి.. బాధ్యతలను స్వీకరిస్తారన్నారు.

చంద్రశేఖర్‌కు పార్టీ శ్రేణులు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.