కవలలే..కానీ పుట్టిన సంవత్సరాలే వేరు!

04 January, 2018 - 12:37 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూయార్క్: సహజంగా కవల పిల్లలంటే కొన్ని సెకన్లు, నిమిషాల తేడాలో జన్మిస్తారు. అయితే వేర్వేరు రోజులే కాదు.. వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలను ఎప్పుడైనా చూశారా? చాలా అరుదుగా జరిగే ఘటన ఇది. వాళ్లిద్ద‌రూ క‌వ‌లలే… కేవ‌లం 18 నిమిషాల తేడాతో జ‌న్మించారు. కానీ వారి పుట్టిన‌తేదీల మ‌ధ్య ఏడాది తేడా ఉంది. ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణం కొత్త సంవ‌త్స‌రం.

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మ‌రియా ఎస్ప‌రెంజాకు ఇద్ద‌రు క‌వ‌ల‌లు పుట్టారు. డిసెంబ‌ర్ 31, 2017 అర్థ‌రాత్రి 11:58 గంట‌ల‌కు బాబు జ‌న్మించ‌గా, జ‌న‌వ‌రి 1, 2018న 00:16 గంట‌ల‌కు పాప జ‌న్మించింది. వీరికి జోయాక్విన్ జూనియ‌ర్ ఓంటివెరోస్‌, ఐతానా దె జీస‌స్ ఓంటివెరోస్ అని పేర్లు పెట్టారు. నిజానికి వీళ్లిద్ద‌రూ జ‌న‌వ‌రి 27న జన్మించాల్సి ఉంది.

అయితే డిసెంబ‌ర్ 31నే తల్లి మ‌రియాకు పురిటి నొప్పులు రావ‌డంతో డెలానో రీజిన‌ల్ మెడిక‌ల్ సెంట‌ర్‌కి తీసుకువ‌చ్చారు. అదేరోజు అక్క‌డి డాక్ట‌ర్లు ఆమెకు డెలివ‌రీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని నిమిషాల తేడాతో ఇద్దరు కవలలు జన్మించారు. జొవాక్విన్ డిసెంబర్ 31, 2017 రాత్రి 11ః58కి జన్మించగా.. అతని చెల్లెలు జనవరి 1, 2018 12ః16 గంటలకు జన్మించింది. తమ 35 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి అరుదైన ఘ‌ట‌న చూడ‌లేద‌ని ఆస్పత్రి డాక్ట‌ర్లు తెలిపారు. ఆసుప‌త్రి సంప్ర‌దాయంలో భాగంగా కొత్త సంవ‌త్స‌రంలో జ‌న్మించిన మొద‌టి శిశువుల‌కు 3000 డాల‌ర్లు బ‌హుమ‌తిగా ఇచ్చినట్లు వారు చెప్పారు.